BCCI Review Meeting: ముంబై నగరంలో జరిగిన బీసీసీఐ (BCCI) ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్లు శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ హాజరైనప్పటికీ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం గైర్హాజరు కావడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై టీమిండియా క్రికెట్ పెద్దలు, గంభీర్-అగార్కర్ ద్వయం మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని, అందుకే ఆయన ఈ మీటింగ్ కి దూరంగా ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. రోహిత్‌కు బీసీసీఐ మద్దతు ఇస్తుండగా, గంభీర్-అగార్కర్ మాత్రం కొత్త ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని భావిస్తున్నట్లు ప్రచారం కొనసాగుతుంది.
అగార్కర్ ఎందుకు రాలేదంటే?:
అజిత్ అగార్కర్ గైర్హాజరుపై వస్తున్న ఊహాగానాలకు బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవ్‌జీత్ సైకియా క్లారిటీ ఇచ్చారు. అతి తక్కువ సమయంలోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఆ సమయంలో అగార్కర్ ముంబై నగరంలో లేకపోవడంతోనే ఆయన రాలేకపోయాడని తేల్చిచెప్పాడు. నెట్‌వర్క్ సరిగ్గా లేని ప్రాంతంలో ఉండటంతో ఆన్‌లైన్‌లో కూడా హాజరు కాలేకపోయారని వివరించారు. సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన భవిష్యత్తుపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, రూమర్లకు బలం చేకూర్చేలా తాను మాట్లాడలేనని సైకియా పేర్కొన్నారు.
సేఫ్ గానే చీఫ్ సెలెక్టర్ పదవి:
మరోవైపు, అజిత్ అగార్కర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను సెలెక్షన్ కమిటీ హెడ్‌గా నియమిస్తారంటూ వస్తున్న వార్తలను క్రిక్‌బజ్ నివేదిక ఖండించింది. అగార్కర్ పదవికి ఎలాంటి ముప్పు లేదని, వచ్చే ఏడాది జూలై వరకు ఉన్న ఆయన కాంట్రాక్ట్ గడువు ముగిసే వరకు అతడ్ని ఆ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. అంతేకాకుండా, అక్టోబర్-నవంబర్‌లో జరిగే ప్రపంచకప్ దృష్ట్యా ఆయన కాంట్రాక్ట్‌ను మరింత కాలం పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది.
సెలెక్షన్ మీటింగ్ కాదది.. దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు అగార్కర్:
గురువారం జరిగిన ఈ సమావేశంలో ఎలాంటి జట్టు ఎంపిక చర్చలు జరగలేదని, కాబట్టి అగార్కర్ హాజరుకాకపోవడంతో ఎలాంటి ఇబ్బంది కలగలేదని బీసీసీఐ తెలిపింది. ఇటీవల శ్రీలంకలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా చివరిసారిగా కనిపించిన అగార్కర్, సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో మళ్లీ ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది. దీంతో అజిత్ పదవి ఊడుతోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ పడినట్లయింది.
