ప్రియురాలి బర్త్ డేకు ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాలని.. గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు చిక్కిన ప్రేమజంట

ప్రియురాలి బర్త్ డేకు ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాలని.. గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు చిక్కిన ప్రేమజంట

ప్రియురాలి పుట్టినరోజుకు ఖరీదైన ఐఫోన్ గిఫ్ట్‌గా ఇవ్వాలనే మోజుతో గంజాయి రవాణాకు దిగిన ఓ జంట చివరకు పోలీసులకు చిక్కింది. తెలంగాణ ఈగల్ ఫోర్స్  వైరా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ. 6 లక్షల విలువైన 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

పథకం ప్రకారం ఒడిశా నుంచి సరఫరా

పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లికి చెందిన మిత్ర చైతన్య (21), హేమలత (20) ఐఫోన్ కొనుగోలు కోసం డబ్బులు సంపాదించేందుకు ఈ దారి ఎంచుకున్నారు. వీరిద్దరూ పెద్దపల్లి నుంచి ఒడిశాలోని పసుపులంక ప్రాంతానికి వెళ్లి ఐదు రోజుల పాటు అక్కడే బస చేశారు. అక్కడి స్థానిక సరఫరాదారు భగవాన్ హంటాల్ వద్ద  రూ.16 వేలకు 12 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. దానిని హైదరాబాద్ తెచ్చి స్థానికంగా విక్రయించి లాభాలు పొందాలని ప్లాన్ చేశారు.
దారకొండ, గూర్తేడు, మారేడుమిల్లి, రాజమండ్రి, సత్తుపల్లి మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా.. వైరా రింగ్ సెంటర్ వద్ద ఈగల్ ఫోర్స్, వైరా పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు.

పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నిందితులు తమ పల్సర్ బైక్‌తో పోలీస్ సిబ్బందిని, వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో వైరా సబ్ ఇన్‌స్పెక్టర్ తీవ్రంగా గాయపడగా, బైక్ పైనుంచి కిందపడి నిందితులిద్దరికీ కూడా గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని చికిత్స అందించారు.హైదరాబాద్‌లో ఈ గంజాయిని స్వీకరించి అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్న కరీంనగర్‌కు చెందిన శశి, పెద్దపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఎండీ నాగుల్ (25) తో పాటు ఒడిశా సరఫరాదారు భగవాన్ హంటాల్ పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అరెస్టయిన మిత్ర చైతన్యపై గతంలో కూడా పలు ఎన్‌డీపీఎస్ (NDPS) కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పెదపల్లి, ఉప్పల్, మేడ్చల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతనిపై కేసులు నమోదు కాగా,  ఏప్రిల్ 30, 2026న జైలు నుంచి విడుదలై మళ్లీ ఈ నేరానికి పాల్పడినట్లు వెల్లడించారు.