మంధాన మెరుపులు.. ఆసియా కప్లో ఇండియా.. విమెన్స్ రెండో విజయం

మంధాన మెరుపులు.. ఆసియా కప్లో ఇండియా.. విమెన్స్ రెండో విజయం

 137 రన్స్‌ తేడాతో హాంకాంగ్‌పై గెలుపు 
 సెమీస్‌లోకి ప్రవేశించిన హర్మన్‌సేన 

దుబాయ్‌: విమెన్స్‌ టీ20 ఆసియా కప్‌లో ఇండియా వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓపెనర్‌ స్మృతి మంధాన (64 బాల్స్‌లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 124) రికార్డు సెంచరీతో చెలరేగడంతో.. గురువారం జరిగిన గ్రూప్‌–ఎ మ్యాచ్‌లో ఇండియా 137 రన్స్‌  తేడాతో హాంకాంగ్‌పై గెలిచింది.

ఫలితంగా సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. టాస్‌ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 193/5 స్కోరు చేసింది. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన మంధాన తర్వాత బ్యాట్‌ ఝుళిపించింది. రెండో ఎండ్‌లో షెఫాలీ వర్మ (28) ఉన్నంతసేపు దడదడలాడించింది. పవర్‌ప్లే చివరి ఓవర్‌లో ఇద్దరు కలిసి 22 రన్స్‌ రాబట్టారు. ఫలితంగా తొలి వికెట్‌కు 74 రన్స్‌ జత చేసి బలమైన పునాది వేసింది.

హాంకాంగ్‌ బౌలర్లు వైడ్‌ లైన్‌ స్ట్రాటజీతో మంధానాను ఇబ్బందిపెట్టాలని చూసినా బలమైన షాట్లతో ఆధిపత్యం చూపెట్టింది. తన తొలి టీ20 సిరీస్‌ ఆడుతున్న ప్రతీకా రావల్‌ (10) నిరాశపర్చింది. కవర్స్‌ ప్రాంతంలో బిబికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. రెండో వికెట్‌కు 37 రన్స్‌ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన రిచా ఘోష్‌ (11), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (11) అనవసరపు షాట్లు ఆడి వికెట్లు ఇచ్చుకున్నారు.

అయితే రెండో ఎండ్‌లో గ్రౌండ్‌ నలుమూలలా భారీ షాట్లు ఆడిన మంధాన 17వ ఓవర్‌లో టీ20ల్లో రెండో సెంచరీ పూర్తి చేసింది. అన్ని ఫార్మాట్లలో కలిపి ఆమెకు ఇది 18వ శతకం కాగా, విమెన్స్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా దిగ్గజం మెగ్‌ లానింగ్‌ (17) రికార్డును అధిగమించింది. ఇక అత్యధిక రన్స్‌ చేసిన జాబితాలో మిథాలీ రాజ్‌ (10,868)ను వెనక్కి నెట్టింది. మరీనా లాంప్లో 2 వికెట్లు తీసింది. విమెన్స్‌ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా మంధాన (95).. హర్మన్‌ప్రీత్‌ (89)ను అధిగమించింది. 

బౌలర్లు అదుర్స్‌..

ఛేజింగ్‌లో హాంకాంగ్‌ 16.2 ఓవర్లలో 56 రన్స్‌కే కుప్పకూలింది. కెప్టెన్‌ నటాషా మైల్స్‌ (15) టాప్‌ స్కోరర్‌. ఇండియా బౌలర్లు దీప్తి శర్మ (3/9) మూడు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక్క రన్‌ కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీసింది. నందని శర్మ (2/6), శ్రీచరణి (2/16), ప్రేమ రావత్‌ (2/12) సమయోచితంగా బౌలింగ్‌ చేసి హాంకాంగ్‌ను అడ్డుకున్నారు. మరీనా లాంప్లో (14), యాస్మిన్‌ దస్వాని (11)తో సహా మిగతా అందరూ ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో హాంకాంగ్‌కు ఓటమి తప్పలేదు. స్మృతికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.