రోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్స్‌కు BCCI చెక్.. పుకార్లను నమ్మొద్దన్న దేవజిత్ సైకియా

రోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్స్‌కు BCCI చెక్.. పుకార్లను నమ్మొద్దన్న దేవజిత్ సైకియా

Rohit Sharma Retirement: 2027 వన్డే ప్రపంచకప్‌లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే ఊహాగానాలకు బీసీసీఐ తెరదించింది. ముంబైలోని ప్రధాన కార్యాలయంలో ఈరోజు (సెప్టెంబర్ 3న) జరిగిన సమీక్షా సమావేశం అనంతరం రోహిత్ స్థానానికి ఎలాంటి ముప్పూ లేదని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. రోహిత్ భవిష్యత్తుపై ప్రస్తుతం యథాతథ స్థితి (Status Quo) కొనసాగుతుందని, అతడు ప్రసుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా స్పష్టం చేశారు.

హై-వోల్టేజ్ మీటింగ్.. చీఫ్ సెలెక్టర్ అగార్కర్ గైర్హాజరీ: 

ఈ కీలక భేటీకి వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లతో పాటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ నేరుగా హాజరయ్యారు. అయితే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ సమావేశానికి గైర్హాజరు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముంబైకి దూరంగా ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతంలో ఉండటం వల్లే అగార్కర్ హాజరుకాలేదని సమాచారం ఉన్నప్పటికీ, ఆయన గైర్హాజరీపై క్రికెట్ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

లక్ష్మణ్ కొత్త రోల్, సెలెక్షన్ కమిటీ మార్పులపై క్లారిటీ: 

మరోవైపు వీవీఎస్ లక్ష్మణ్‌కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ లాంటి కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పూర్తిగా తోసిపుచ్చారు. అలాగే అజిత్ అగార్కర్ నాయకత్వంలోని సెలెక్షన్ కమిటీలో ఎలాంటి తక్షణ మార్పులు చేయడం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ సమావేశానికి అగార్కర్ రాకపోయినప్పటికీ సెలెక్షన్ ప్యానెల్ తీరుపై ఎలాంటి అసంతృప్తి లేదని, ప్రస్తుతానికి అదే కమిటీని ముందుకు కొనసాగిస్తున్నట్లు బోర్డు తేల్చి చెప్పింది.  

రోహిత్ ఫామ్‌పై ప్రశంసలు.. వరల్డ్ కప్ రేసులో హిట్‌మ్యాన్: 

ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో లార్డ్స్ మైదానంలో 138 పరుగులతో విరుచుకుపడిన స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలిని దేవజిత్ సైకియా ప్రత్యేకంగా కొనియాడారు. రోహిత్ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో మీరు కూడా చూస్తున్నారు కదా అని వ్యాఖ్యానిస్తూ, అతని స్థానం ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రమాదంలో లేదూ, ప్రస్తుతం జరుగుతున్న పుకార్లకు అడ్డుకట్ట వేశారు. దీంతో 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ భాగస్వామ్యంపై బీసీసీఐ సానుకూలంగా ఉందనే విషయం స్పష్టమైంది.