AP Election 2026: అప్పుడు ఎన్నికల కమిషనర్ నే తప్పించారు.. ఇప్పుడు నీతులా జగన్..? మంత్రి అచ్చెన్నాయుడు

AP Election 2026: అప్పుడు ఎన్నికల కమిషనర్ నే తప్పించారు.. ఇప్పుడు నీతులా జగన్..? మంత్రి అచ్చెన్నాయుడు

ఏపీలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. నామినేషన్ల సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తతలపై వైసీపీ అధినేత జగన్ గవర్నర్. ఎస్ఈసీలను కలిసి ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు జగన్ కు కౌంటర్ ఇచ్చారు. నాడు ఎన్నికల కమిషనర్ నే తప్పించారు.. ఇప్పుడు నీతులా జగన్ అని ప్రశ్నించారు. ఈమేరకు ఆదివారం ( అక్టోబర్ 18 ) రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో జగన్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు అచ్చెన్నాయుడు.

అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, నేడు మరో విధంగా ప్రజాస్వామ్యాన్ని నిర్వచించడం తగదని పేర్కొన్నారు. నేడు ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం, నామినేషన్ల ప్రక్రియపై జగన్ సంధిస్తున్న ప్రశ్నలనే 2020 స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అడిగారని గుర్తుచేశారు. 

ఆనాడు ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు, నామినేషన్ పత్రాల ధ్వంసం, బలవంతపు ఉపసంహరణలపై వచ్చిన ఫిర్యాదులకు నాటి ప్రభుత్వం ఇచ్చిన సమాధానమేమిటని నిలదీశారు అచ్చెన్నాయుడు. ప్రజాస్వామ్య పరిరక్షణపై ఉపన్యాసాలు ఇచ్చే ముందు గత ఐదేళ్ల పాలనలో చోటుచేసుకున్న వివాదాలపై జగన్ ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు.

2020లో మాచర్లలో నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో టీడీపీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తున్న వాహనంపై కర్రలు, రాళ్లతో దాడి జరిగిన ఘటనను జగన్ గుర్తుచేసుకోవాలని అచ్చెన్నాయుడు అన్నారు. ఆ ఘటనలో వాహనం ధ్వంసమవడంతో పాటు వారి వెంట ఉన్న న్యాయవాది గాయపడిన విషయాన్ని ప్రస్తావించారు. 

వైసీపీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని అప్పట్లో టీడీపీ ఆరోపించినప్పటికీ అధికార పార్టీ ఆ ఆరోపణలను ఖండించిందని తెలిపారు. ఒక మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న వాహనంపైనే దాడి జరిగితే గ్రామాల్లో పోటీ చేస్తున్న సామాన్య కార్యకర్తల భద్రతపై ఎంతటి ఆందోళన నెలకొని ఉంటుందో ఆలోచించాలని ప్రశ్నించారు. నేడు తమ ఎంపీలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న జగన్, ఆనాడు ప్రతిపక్ష నాయకుల భద్రతపై ఎందుకు అదే స్థాయిలో స్పందించలేదని నిలదీశారు అచ్చెన్నాయుడు.