ముగిసిన BCCI మీటింగ్: గిల్, గంభీర్ ముఖాల్లో టెన్షన్.. అసలు ఏం జరిగింది?

ముగిసిన BCCI మీటింగ్: గిల్, గంభీర్ ముఖాల్లో టెన్షన్.. అసలు ఏం జరిగింది?

BCCI Review Meeting: టీమిండియా ఇటీవల చవిచూసిన వరుస పరాజయాలపై బీసీసీఐ ఈరోజు (సెప్టెంబర్ 3న, గురువారం) ముంబై ప్రధాన కార్యాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించింది. బోర్డు అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్లు శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లతో పాటు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) డైరెక్టర్‌ వీవీఎస్ లక్ష్మణ్ నేరుగా హాజరవ్వగా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వర్చువల్‌గా పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన ఈ హై-వోల్టేజ్ మీటింగ్ ముగిసిన తర్వాత గంభీర్, గిల్ ముఖాల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తుండగా.. మీడియాతో మాట్లాడకుండానే వీరు సైలెంట్‌గా వెళ్లిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

భారత కోచింగ్ స్టాఫ్‌పై బీసీసీఐ ఫైర్: 

టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న భారత జట్టు ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లలో వరుసగా 6 టీ20 మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా గెలవకపోవడంపై బీసీసీఐ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ మ్యాచ్‌ను డ్రాగా ముగించడంపై గంభీర్, అగార్కర్‌లను బోర్డు గట్టిగా నిలదీసింది. జట్టులో నిలకడలేని బ్యాటింగ్ తీరుతో పాటు పదే పదే ఆటగాళ్లు గాయపడటం, ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తడంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నుంచి బీసీసీఐ వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 

రోహిత్ శర్మ వన్డే కెరీర్‌పై సస్పెన్స్: 

ఈ సమావేశంలో ప్రధానంగా సీనియర్ దిగ్గజం రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వన్డేలో అద్భుత శతకం సాధించినప్పటికీ, 39 ఏళ్ల రోహిత్‌ను 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో కొనసాగించాలా వద్దా అనే దానిపై బీసీసీఐ సెలెక్టర్లతో విశ్లేషించింది. రోహిత్ రిటైర్మెంట్ వార్తలను బీసీసీఐ కార్యదర్శి ఖండించినప్పటికీ, ఫ్యూచర్ టీమ్ బిల్డింగ్‌లో అతడి పాత్రపై సస్పెన్స్ కొనసాగుతుంది. కానీ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలపై ఎలాంటి ఒత్తిడి లేదని తెలుస్తుంది. 

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఐదో స్థానం: 

ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో టీమిండియా ఐదో స్థానంలో కొనసాగుతుంది. రాబోయే న్యూజిలాండ్ ఆల్-ఫార్మాట్ పర్యటన అత్యంత కీలకంగా మారింది. ఈ ఏడాది చివర్లో కివీస్ గడ్డపై జరగనున్న 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం ద్వారా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో మళ్లీ పుంజుకోవాలని బీసీసీఐ ఆదేశించింది. ఇందుకోసం కీలక ప్లేయర్స్ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను సమర్థవంతంగా పర్యవేక్షిస్తూనే, బలమైన బెంచ్ స్ట్రెంగ్త్‌ను సిద్ధం చేయాలని కోచింగ్ స్టాఫ్‌కు బోర్డు గైడ్ లైన్స్ జారీ చేసింది.