సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఫ్లెక్సీ స్థానికుల దృష్టిని ఆకర్షించింది. సంస్థాన్ నారాయణపురం మండలం కేలోతు తండాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫ్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నారాయణపురం మండలం వ్యాప్తంగా సుమారు రూ. 114 కోట్ల నిధులతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
అందులో భాగంగా కేలోతు తండాలో తన వీరాభిమాని ఒకరు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తెలంగాణ సీఎంగా చూడాలని ఉందని భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో అందరి చూపు ఆ ఫ్లెక్సీ పైనే పడింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా.. ‘మనకూ ఓ రోజస్తది, సమయం వస్తే ముఖ్యమంత్రి అవుతా.. ఆ టైమొస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు’అని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
బుధవారం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంలలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా.. కార్యకర్తలు సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. స్లోగన్స్‌కు స్పందిస్తూ.. భవిష్యత్తులో దేవుడి దయతో తనకు అవకాశం వస్తే ఎవరూ ఆపలేరన్నారు.
ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు అవమానం జరుగుతోందని, బయటి నుంచి వచ్చినోళ్లు కాంగ్రెస్‌ను కబ్జా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వదిలిపోయే పరిస్థితి వచ్చిందని, కీలక నేత చిన్నారెడ్డికి అవమానం జరుగుతోందన్నారు.
కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ లాంటి వారిని ఎందుకు తీసుకుంటున్నారని నిలదీశారు. పార్టీని బలోపేతం చేసేందుకు ఇతరులను చేర్చుకుంటే తప్పు లేదని, కానీ, ఎంతోకాలంగా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను వెల్లగొడ్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు.
