సాఫ్ట్‌వేర్ ఉద్యోగం, లక్షల రూపాయల జీతం, స్థిరమైన కెరీర్.. ఇవన్నీ వదిలేసి ఎవరైనా కొత్త దారి వెతుక్కుంటారా? హైదరాబాద్‌కు చెందిన సాయికిరణ్ భగవతుల అనే టెక్కీ ఈ సాహసమే చేశారు. దశాబ్దానికి పైగా ఐటీ రంగంలో విజయవంతమైన జీవితాన్ని గడిపిన ఆయన.. తనకున్న ప్రవృత్తిని నమ్మి ఒక వినూత్న వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. జంతువుల ప్రవర్తన, అడవిలోని జీవన విధానం నుంచి కార్పొరేట్ కంపెనీలకు పాఠాలు నేర్పడమే లక్ష్యంగా 'వైల్డ్‌లైఫ్ విస్పరర్స్' పేరుతో ఒక స్టార్టప్‌ను ప్రారంభించారు. ఈ విభిన్నమైన ఆలోచన తొలి ఏడాదే ఏకంగా రూ.80 లక్షల రెవెన్యూను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
టెక్కీ నుంచి కంటెంట్ క్రియేటర్, ఫోటోగ్రాఫర్‌గా:
సాయికిరణ్ ప్రయాణం మొదట సాధారణ ఇంజనీరింగ్‌తోనే సాగింది. 2010లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన.. హైదరాబాద్, చెన్నై, ముంబై నగరాల్లో ఐటీ ఉద్యోగాలు చేశారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి.. నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో డేటా సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఉద్యోగ జీవితం ఎంత బిజీగా ఉన్నప్పటికీ వన్యప్రాణులపై ఉన్న మమకారాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. వీకెండ్స్‌లో కెమెరా పట్టుకుని అడవులు తిరగడం, జంతువులను ఫోటో తీయడం అలవాటు చేసుకున్నారు. ఈ ఫోటోగ్రఫీ కేవలం అభిరుచితో ఆగకుండా, జీవ ఆవరణాలు, మనుగడ గురించిన లోతైన కథలను తనకు పరిచయం చేసిందని సాయికిరణ్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
అడవి జంతువుల నుంచి కార్పొరేట్ పాఠాలు:
అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చాక సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేసిన ఆయన.. 2023లో తన 13 ఏళ్ల ఐటీ కెరీర్‌కు పూర్తిగా స్వస్తి పలికారు. ప్రకృతిని మించిన గురువు లేడన్న నమ్మకంతో 'వైల్డ్‌లైఫ్ విస్పరర్స్' వెంచర్‌ను స్థాపించారు. కార్పొరేట్ రంగంలోని సంక్లిష్టమైన సవాళ్లను పరిష్కరించేందుకు అడవి జంతువుల ప్రవర్తనా సరళిని ఒక సాధనంగా మలిచారు. ఉదాహరణకు సింహాల జీవన విధానం ద్వారా టీమ్‌వర్క్ ఎలా ఉండాలి, చీమల నుంచి బాధ్యతల విభజన(డెలిగేషన్) ఎలా నేర్చుకోవాలో కార్పొరేట్ ఉద్యోగులకు వివరిస్తారు. తేనెటీగలు ప్రమాదాలను ఎదుర్కొనే తీరును సమిష్టి స్పందనకు ఉదాహరణగా చూపుతారు. ఈ కార్యక్రమాలు కేవలం క్లాస్‌రూమ్ ట్రైనింగ్ కాకుండా.. నేరుగా అడవిలో అనుభవాలను పంచే మల్టీ-డే వైల్డ్‌ర్నెస్ టూర్స్‌గా నిర్వహిస్తారు.
తొలి ఏడాదే రూ.80 లక్షల టర్నోవర్:
ఈ వినూత్న ఆలోచనకు కార్పొరేట్ లోకం నుంచి అద్భుతమైన స్పందన లభించింది. పెర్ఫెట్టి వాన్ మెల్లె, సీమెన్స్ డిజిటల్ వంటి దిగ్గజ సంస్థలు సాయికిరణ్ సేవలను వినియోగించుకున్నాయి. బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలకు చెందిన పలు కంపెనీలు కూడా ఈ వర్క్‌షాప్‌ల పట్ల ఆసక్తి చూపుతున్నాయి. ఫలితంగా ఎలాంటి పెద్ద వనరులు లేకుండా కేవలం బూట్‌స్ట్రాప్ పద్ధతిలో నడిచిన ఈ స్టార్టప్, తన మొదటి సంవత్సరంలోనే రూ.80 లక్షల వ్యాపారాన్ని సాధించింది. బెంగళూరులో జరిగిన TiE గ్లోబల్ సమ్మిట్ 2024లోనూ సాయికిరణ్ తన స్టార్టప్ ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు.
అనుభవాల కలయికే విజయ రహస్యం:
ఐటీ రంగంలో తనకు ఉన్న కార్పొరేట్ మేనేజ్‌మెంట్ అనుభవం, వన్యప్రాణులపై ఉన్న మక్కువను కలపడం ద్వారా సాయికిరణ్ ఒక సరికొత్త సక్సెస్ స్టోరీని క్రియేట్ చేశారు. లీడర్‌షిప్ లక్షణాలు, సమిష్టి సహకారం, మానసిక ప్రశాంతత వంటి అంశాలపై అడవి నేర్పే పాఠాలను కార్పొరేట్ ఉద్యోగులకు అర్థమయ్యేలా చెప్పడంలో సఫలమయ్యారు. ఐటీ ఉద్యోగాన్ని వీడి, ప్యాషన్‌ను బిజినెస్‌గా మార్చుకుని స్టార్టప్ రంగంలో రాణించవచ్చని నిరూపించిన సాయికిరణ్ ప్రయాణం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
