ఫోక్స్‌వ్యాగన్ సంచలన నిర్ణయం.. ఖర్చులు తగ్గించుకునేందుకు 50వేల ఉద్యోగులు లేఆఫ్

ఫోక్స్‌వ్యాగన్ సంచలన నిర్ణయం.. ఖర్చులు తగ్గించుకునేందుకు 50వేల ఉద్యోగులు లేఆఫ్

జర్మన్ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో కఠినమైన పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను ప్రకటించింది. చైనా మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమెరికా విధిస్తున్న భారీ సుంకాలు, పెరిగిపోతున్న ఉత్పత్తి ఖర్చుల కారణాల వల్ల కంపెనీ లాభాలు భారీగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఫోక్స్‌వ్యాగన్ సూపర్‌వైజరీ బోర్డు 'ఫ్యూచర్ ప్లాన్ 2030'కి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ఈ కొత్త వ్యూహంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అదనంగా దాదాపు 50వేల మంది ఉద్యోగులను తొలగించనున్నారు. ఇప్పటికే అమలులో ఉన్న వివిధ కార్యక్రమాలతో కలిపి మొత్తంగా ఈ లేఆఫ్స్ ఏకంగా లక్షకు చేరుకునే అవకాశం ఉంది. ఇందులో మేనేజ్‌మెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. జర్మనీలోని ఎండెం, జ్వికావ్, హనోవర్, నెకర్‌సల్మ్ ప్లాంట్ల భవిష్యత్తు ప్రస్తుతం అనిశ్చితిలో పడింది. యూరప్‌లో తమ ప్రొడక్షన్ సామర్థ్యం డిమాండ్ కంటే ఏటా 5 లక్షల వాహనాలు ఎక్కువగా ఉందని గుర్తించిన కంపెనీ.. యూరోపియన్ ఫ్యాక్టరీల కోసం 2027 జూన్ నాటికి కొత్త ప్లాన్ సిద్ధం చేస్తోంది.

తయారీ ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా మోడల్ పోర్ట్‌ఫోలియోను సగానికి కుదించాలని, వేరియంట్లు, కాన్ఫిగరేషన్‌లను 2035 నాటికి 75 శాతం వరకు తగ్గించాలని సంస్థ నిర్ణయించింది. దీనివల్ల ప్రతి వాహనంపై ఉత్పత్తి పరిమాణం పెరిగి ఖర్చులు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే మేనేజ్‌మెంట్ వ్యవస్థను సరళీకరించి, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. 2027 నుంచి 2031 మధ్య కాలంలో R&D, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం 135 బిలియన్ యూరోలను వెచ్చించనున్నట్లు వెల్లడించింది.

ఈ ఏడాది మెుదటి 6 నెలల్లో కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ కేవలం 3.8 శాతానికి పడిపోగా.. 2030 నాటికి దానిని 9 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమెరికా సుంకాల వల్ల ఏటా దాదాపు 5 బిలియన్ యూరోల భారం పడుతుండగా, చైనాలో విక్రయాలు 25 శాతం పైగా క్షీణించాయి. ఈ క్లిష్ట సమయంలో ఉద్యోగుల ప్రతినిధులు, యాజమాన్యం, లోయర్ సాక్సోనీ ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్తులో లాభాల బాట పట్టేందుకు ఫోక్స్‌వ్యాగన్ చేస్తున్న ఈ సాహసోపేత ప్రయత్నం ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు చర్చనీయాంశమైంది.