మహబూబాబాద్ లో  నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టు: 30 లక్షల దందా.. నలుగురు అరెస్ట్

మహబూబాబాద్ లో  నకిలీ సర్టిఫికెట్ల గుట్టు రట్టు: 30 లక్షల దందా.. నలుగురు అరెస్ట్

మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో  నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ కలకలం రేపింది.  ప్రభుత్వ అధికారిక ముద్రలను, డిజిటల్ కీలను దుర్వినియోగం చేస్తూ అమాయకులను మోసగిస్తున్న ఒక నకిలీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

ఈ కుంభకోణానికి సంబంధించిన అసలు నిజాలు షాకింగ్‌గా ఉన్నాయి.  బయ్యారం ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ప్రైవేట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి... గ్రామపంచాయతీ కార్యదర్శుల రహస్య డిజిటల్ కీలను ఎత్తుకెళ్లాడు. ఆ డిజిటల్ కీలను అడ్డుపెట్టుకుని, మీసేవ నెట్ సెంటర్లే అడ్డాలుగా నకిలీ దందాకు తెరలేపాడు.

ఎలాంటి అర్హత లేకుండానే ఏకంగా 270 జనన ధ్రువపత్రాలు, 19 మరణ ధ్రువపత్రాలను అక్రమ పద్ధతిలో మంజూరు చేశారు. మరీ ముఖ్యంగా, ఈ నకిలీ మరణ ధ్రువపత్రాలను ఉపయోగించి కొందరు కేటుగాళ్లు ఇన్సూరెన్స్ సొమ్మును కూడా కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.ఈ మొత్తం దందాలో  సుమారు 30 నుండి40 లక్షల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం.

ఈ భారీ మోసానికి పాల్పడిన నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అక్రమ తతంగంలో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయి? వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. చట్టంతో చెలగాటమాడితే ఎంతటివారైనా కఠిన శిక్ష తప్పదని ఈఘటన మరోసారి హెచ్చరిస్తోంది.