మెదక్ జిల్లాలో ఇప్పటికీ 2 వేల గుడిసెలు..

మెదక్ జిల్లాలో ఇప్పటికీ  2 వేల గుడిసెలు..

మెదక్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడతలో ఇందిరమ్మ కమిటీలు గుర్తించిన వారికి, సొంత జాగా ఉండి ఇండ్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చిన వారికి అవకాశం కల్పించారు. రెండో విడతలో గుడిసెలు లేని గ్రామాలు లక్ష్యంగా అసలు ఇండ్లు లేకుండా పక్కగా గుడిసెల్లో నివసిస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా అధికారులు అర్హులను గుర్తిస్తూ ఇండ్ల మంజూరు కోసం జిల్లా ఇన్​ఛార్జి మంత్రికి ప్రతిపాదనలు పంపుతున్నారు. 

2,037 గుడిసెల గుర్తింపు.. 

మెదక్ జిల్లాలో 21 మండలాలు, 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. అధికారులు అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి మొత్తం 2,037 గుడిసెలు ఉన్నట్టు గుర్తించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కావాలంటే పక్కగా కుటుంబం పూరి గుడిసెలోనే నివాసం ఉండాలి. ఈ మేరకు నిజమైన అర్హులను గుర్తించేందుకు ప్రతీ మండలానికి ముగ్గురు గజిటెడ్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించారు. వారు ఆర్టిఫిషియల్​ఇంటలిజెన్స్​ద్వారా ఫీల్డ్ వెరిఫికేషన్​చేసి అర్హులను గుర్తించి ఎంపీడీఓల ద్వారా హౌసింగ్ అధికారులకు జాబితా పంపుతున్నారు.

ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో కలిసి 753 మందిని అర్హులుగా గుర్తించగా, వారికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం జిల్లా ఇన్​చార్జి మంత్రి వివేక్​ వెంకట్​స్వామికి ప్రతిపాదనలు పంపినట్టు జిల్లా హౌసింగ్​ఆఫీసర్​ మాణిక్యం తెలిపారు. త్వరలోనే వీటికి మంజూరు లభించనుందని చెప్పారు. ఇవిపోను మిగిలిన 1,284 ఇండ్లకు సంబంధించి వెరిఫికేషన్​ పూర్తి చేసి మంజూరు కోసం మంత్రికి ప్రతిపాదనలు పంపుతామని వివరించారు. మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.