- వంద రోజుల బాండ్ పేపర్ల హామీలు ఏమయ్యాయి ? : హరీశ్రావు
కౌడిపల్లి/నర్సాపూర్, వెలుగు : కేసీఆర్ అమలు చేసిన పథకాలను ఊడగొట్టడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒరగబెట్టిందేమీ లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన కుట్రలు, కబ్జాలు, సెటిల్ మెంట్లకే పరిమితమైందని, రాష్ట్రంలో ఏ వర్గానికి న్యాయం జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యిరోజుల పాలనా వైఫల్యాలపై నర్సాపూర్ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గురువారం మెదక్ జిల్లా కౌడిపల్లిలో జరిగిన నిరసనలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ రైతుల భూములను 22ఏలో పెట్టిన కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికల్లో ప్రజలు నిషేధిత జాబితాలో వేయాలన్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి బాండ్ పేపర్లు రాసిచ్చారని, వెయ్యి రోజులైనా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. కేసీఆర్ 60 లక్షల మంది రైతులకు రైతుబీమా ఇచ్చారని, రైతు చనిపోతే వారం రోజుల్లో రూ. ఐదు లక్షలు వచ్చేవన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రీమియం కట్టకపోవడంతో ఆగస్టు 13 నుంచి రైతుబీమా బంద్ అయిందన్నారు. రైతులకు ఇవ్వాల్సిన రూ. 29 వేల కోట్ల రైతుబంధును రేవంత్ రెడ్డి ఎగ్గొట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పాత రోజులు తెచ్చిందని, 10 గంటలు కూడా కరెంటు రావడం లేదన్నారు.
అప్పట్లో ఊళ్లోకి ఎరువుల బస్తాలు వస్తే ఇప్పుడు రైతుల చెప్పులు లైన్లో పెడుతున్నారని, యాప్‌ల పేర రైతులను ఏడిపిస్తున్నారన్నారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ కలిసి యూరియా దొరకని పరిస్థితి తెచ్చాయన్నారు. కాళేశ్వరం మోటార్లపై డ్రామాలు ఆడుతూ రంగనాయకసాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌లను డెడ్ స్టోరేజీకి తీసుకొచ్చారని బసవేశ్వర, సంగమేశ్వర, ఘనపూర్ ఆనకట్ట, నర్సాపూర్-, మెదక్ కాల్వ పనులన్నీ ఆపేశారన్నారు. కౌడిపల్లిలో సగానికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదని, అందరికీ రుణమాఫీ జరిగిందని తేలితే రాజీనామా చేయడానికి సిద్ధమని, లేకపోతే సీఎం రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. ‘ఉద్యోగాలు అడిగితే నిరుద్యోగులను ఎండ్రిన్ తాగమంటాడు.
ఫీజు రీయింబర్స్ మెంట్ అడిగితే విద్యార్థుల వీపులు పగలగొడుతున్నాడు. ఆశా, అంగన్వాడీ వర్కర్లపై లాఠీచార్జ్ చేయిస్తున్నాడు. ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటున్నాడు. అసలు ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడమే అతిపెద్ద క్రిమినల్ వేస్ట్' అని మండిపడ్డారు. కౌడిపల్లి, మహమ్మద్ నగర్ పీఏసీఎస్‌లో జరిగిన కుంభకోణంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి, మంతూర్ గ్రామాల శివారులో నిలిచిపోయిన కాళేశ్వరం కాలువ పనులను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి పరిశీలించారు.
