10 రూపాయలకే రిలయన్స్ ఐస్ క్రీమ్.. మార్కెట్‌ను అంబానీ కబ్జా చేసేస్తున్నారా..?

10 రూపాయలకే రిలయన్స్ ఐస్ క్రీమ్.. మార్కెట్‌ను అంబానీ కబ్జా చేసేస్తున్నారా..?

ఇప్పటికే వాటర్ నుంచి పెట్రోలియం వరకూ అనేక వ్యాపారాల్లో ముఖేష్ అంబానీ దూసుకుపోతున్నారు. కొన్నాళ్ల కిందట బివరేజెస్ వ్యాపారంలో క్యాంపా కొనుగోలుతో తన రూ.10 ప్రైసింగ్ స్ట్రాటజీ వాడి కోకాకోలా, పెప్సీ కంపెనీలకు షాక్ ఇచ్చారు. అయితే ఇదే సీన్ ఐస్ క్రీమ్స్ వ్యాపారంలోనూ రిపీట్ చేసేందుకు సిద్ధం అయ్యారు అంబానీ. రోడ్డు పక్కన అమ్మే లోకల్ బ్రాండ్స్ కూడా అందించలేని డెడ్ చీప్ రేట్లకు ఐస్ క్రీమ్ అమ్మనున్నట్లు ప్రకటించటంతో ఈ వ్యాపారంలో ఉన్న అమూల్, అరుణ్, హిందుస్థాన్ యూనీలివర్, స్కూప్స్ వంటి పెద్దపెద్ద కంపెనీలు కూడా ప్రస్తుతం వణికిపోతున్నాయి. 

తాను ఎంచుకున్న రంగంలో పోటీదారులను చంపేందుకు మార్కెట్ ఆక్యుపై చేసేందుకు ముఖేష్ అంబానీ వాడే ఉచిత ఆఫర్లు, తక్కువ రేట్ స్ట్రాటజీనే మళ్లీ నమ్ముకుని ఈసారి కూడా తన ఐస్ క్రీమ్ బిజినెస్ సక్సెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. లాభం కాదు ముందు మార్కెట్లో స్థానం ముఖ్యం.. ఆ తర్వాత ప్రత్యర్థిని టార్గెట్ చేయటం రిలయన్స్ సంస్థ దశాబ్థాలుగా ఫాలో అవుతున్న బిజినెస్ సిద్ధాంతం. జియో, జియో హాట్ స్టార్, క్యాంపా ఇలా ప్రతి కొత్త వ్యాపారంలోనూ ముఖేష్ అంబానీ చేసిన పని ఇదే. 

భారతీయ రిటైల్ రంగంలో ఇప్పటికే అనేక సంచలనాలు సృష్టించిన బిలియనీర్ ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్.. తాజాగా FMCG మార్కెట్లో తన దూకుడును మరింత పెంచింది. రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ద్వారా సరికొత్తగా 'బాంబే క్రీమరీ' ఐస్ క్రీమ్ బ్రాండ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అత్యంత పోటీతత్వంతో కూడిన ప్యాకేజ్డ్ ఐస్ క్రీమ్ రంగంలోకి రిలయన్స్ అధికారికంగా అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ ఉత్పత్తులు పశ్చిమ భారతదేశంలో అందుబాటులో ఉండగా.. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

ఈ కొత్త బ్రాండ్‌లో కోన్స్, కప్స్, టబ్స్, బార్స్, స్టిక్స్ వంటి వివిధ రకాల వెరైటీలను అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా కేవలం రూ.10 ప్రారంభ ధరతో ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడం గేమ్ చేంజింగ్ కానుంది. ప్రముఖ డెలివరీ యాప్‌లలో ఇతర బ్రాండ్ల స్టిక్స్ ధర రూ.20 వరకు ఉండగా.. రిలయన్స్ అంతకంటే తక్కువ ధరకే ప్రారంభించడం సామాన్య, మధ్యతరగతి కస్టమర్లను టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రైసింగ్ స్ట్రాటజీ ద్వారా ఫస్ట్-టైమ్ కన్జూమర్లను ఆకట్టుకోవాలని రిలయన్స్ భావిస్తోంది. గతంలో క్యాంపా కోలా బ్రాండ్‌ను కూడా ఇదే విధంగా దూకుడు ధరలతో సక్సెస్ సాధించి సంచలనం సృష్టించిన రిలయన్స్.. ఇప్పుడు ఐస్ క్రీమ్ మార్కెట్లోనూ అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది.

అంబానీ రాకతో అమూల్, వాడిలాల్, మదర్ డైరీ, క్వాలిటీ వాల్స్, బాస్కిన్-రాబిన్స్ వంటి దిగ్గజ బ్రాండ్లకు రిలయన్స్ గట్టి పోటీ ఇవ్వనుంది. రిలయన్స్ వద్ద ఉన్న భారీ రిటైల్ నెట్‌వర్క్, పంపిణీ వ్యవస్థ, డేటా ఈ బ్రాండ్‌కు పెద్ద ఆస్తిగా మారనున్నాయి. ఇప్పటికే క్యాంపా కోలా కోసం దేశవ్యాప్తంగా దుకాణాల్లో ఫ్రీజర్లు ఏర్పాటు చేసిన రిలయన్స్.. అదే నెట్‌వర్క్ ద్వారా ఐస్ క్రీమ్‌లను కూడా ఈజీగా అమ్మగలదు. అయితే కేవలం తక్కువ ధరకే కాకుండా.. నాణ్యతను నిలబెట్టుకుంటూ వినియోగదారులను రిపీట్ కస్టమర్లుగా మార్చుకోవడంపైనే అసలు సక్సెస్ ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.