హైదరాబాద్: సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు, విధివిధానాలపై దిశానిర్దేశం చేసేందుకు సెప్టెంబర్ 6న బీఆర్ఎస్ శాసన సభాపక్ష సమావేశానికి పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఈ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేసీఆర్ ఆదేశించారు.
అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోన్న 22ఏ నిషేధిత జాబితా వివాదాన్ని అసెంబ్లీ సమావేశాల్లోపు పరిష్కరించాలని ప్రభుత్వానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. లేదంటే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని ప్రకటించింది. దీంతో అసెంబ్లీ సమావేశాలపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
సెప్టెంబర్ 7నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు:
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల డేట్ ఫిక్స్ అయింది. 2026, సెప్టెంబర్ 7న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభంకానున్నట్టు అసెంబ్లీ సెక్రటరీ రెండ్ల తిరుపతి శనివారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ సమావేశాల్లో లోకసభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం కీలక తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
►ALSO READ | కాంగ్రెస్ రెండేన్నరేళ్ల పాలన సూపర్ హిట్: మంత్రి వివేక్
