హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ రెండేన్నరేళ్ల పాలన సూపర్ హిట్ అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలన అద్భుతంగా సాగిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి పోయిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు రెండున్నరేండ్లల్లో 3 లక్షల కోట్ల మిత్తి కట్టామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయిన ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమాన్ని కొనసాగించామని చెప్పారు.
తెలంగాణలో కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంత్రి వివేక్ శుక్రవారం (సెప్టెంబర్ 4) మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో 1000 రోజుల్లో అద్భుత పాలన సాగిందన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు, వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. రైతు బీమా, రుణమాఫీ,రైతు భరోసాతో రైతు సంక్షేమానికి పెద్దపీఠ వేశామని చెప్పారు. పదేండ్లలో బీఆర్ఎస్ ఏ ఒక్క హామీ అయినా అమలు చేసిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆనాడు వరి వేయొద్దని రైతులకు చెప్పాడు.. కానీ ఆయన మాత్రం తన ఫామ్‌హౌస్‌లో వరి వేసుకున్నాడని విమర్శించారు.
ALSO READ : ఒక్క ట్వీట్తో ఫుల్ క్లారిటీ ఇచ్చిన కొండా సురేఖ
కాంగ్రెస్ దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టిందని.. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎక్కడైనా కుంగిపోయాయా అని ప్రశ్నించారు. కానీ బీఆర్ఎస్ లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్ట్ మూడేండ్లకు కూలిపోయిందన్నారు. కమీషన్లకు ఆశపడి కడ్తే మూడేండ్లకే కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని ఎద్దేవా చేశారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని.. జపాన్, కొరియాలో వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు మన చేతిలో ఉండవన్నారు.
