ఉద్యోగం మానేసినా 58 ఏళ్ల వరకూ పీఎఫ్ డబ్బుపై వడ్డీ వస్తుందా? EPFO క్లారిటీ

ఉద్యోగం మానేసినా 58 ఏళ్ల వరకూ పీఎఫ్ డబ్బుపై వడ్డీ వస్తుందా? EPFO క్లారిటీ

ఉద్యోగం వదిలేసిన తర్వాత EPF ఖాతాలో ఉన్న డబ్బుపై వడ్డీ వెంటనే నిలిచిపోతుందా లేదా అనే అంశంపై ఉద్యోగుల్లో ఎప్పుడూ సందేహాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ ఫండ్ బాడీ EPFO సోషల్ మీడియా వేదికగా ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. ఉద్యోగి తన జాబ్ వదిలేసినా లేదా ముందుగానే రిటైర్మెంట్ తీసుకున్నా సరే, వడ్డీ చెల్లింపు నిలిచిపోదని.. ఉద్యోగి వయస్సు 58 సంవత్సరాలు నిండే వరకు ఆ ఖాతాపై నిరంతరం వడ్డీ జమ అవుతూనే ఉంటుందని స్పష్టం చేసింది.

ఉదాహరణకు ఒక ఉద్యోగి తన 40 ఏళ్ల వయసులోనే ఉద్యోగం మానేసి.. పీఎఫ్ ఖాతాలోని మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోకుండా అలాగే ఉంచితే, ఆయనకు 58 ఏళ్లు వచ్చే వరకు ఆ డబ్బుపై వడ్డీ వస్తూనే ఉంటుందని ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఒకవేళ ఉద్యోగి 55 సంవత్సరాల తర్వాత రిటైర్ అయితే.. రిటైర్ అయిన తేదీ నుంచి 36 నెలల వరకు ఎలాంటి కంట్రిబ్యూషన్ పడకపోయినా ఖాతా పనిచేస్తుంది. అయితే ఈపీఎఫ్ రూల్స్ ప్రకారం ఖాతాదారునికి 58 ఏళ్లు నిండిన తర్వాత లేదా ఖాతా ఇన్‌యాక్టివ్ అయిన తర్వాత మాత్రమే వడ్డీ జమ కావడం ఆగిపోతుంది. ఒకవేళ ఎవరైనా 60 ఏళ్ల వయసులో రిటైర్ అయితే.. వారికి 63 ఏళ్ల వరకు వడ్డీ వస్తుందన్నమాట.

అయితే పీఎఫ్ అకౌంట్లో ఎటువంటి లావాదేవీలు జరగకుండా రిటైర్మెంట్, శాశ్వతంగా విదేశాలకు వెళ్లిపోవటం, మరణం సంభవించిన 3 సంవత్సరాల తర్వాత ఆ ఖాతాను 'ఇన్‌యాక్టివ్' కేటగిరీ కిందకు మారుతుంది. పీఎఫ్ అకౌంట్ ఇన్‌యాక్టివ్‌గా మారిన తర్వాత వడ్డీ నిలిచిపోతుంది. కాబట్టి ఉద్యోగం మారిన వారు లేదా మానేసిన వారు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదని.. దాన్ని అలాగే ఉంచినా అకౌంట్ హోల్డర్‌కి 58 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు వడ్డీ రూపంలో రాబడి పొందే అవకాశం ఉందని ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేయడం ఉద్యోగులకు ఊరటనిస్తోంది.

ALSO READ : టాటాలకు ఎదురుదెబ్బ.. తట్టాబుట్టా సర్థుకుని టాటా కెమికల్స్ కంపెనీని వెళ్లిపొమ్మన్న కెన్యా!

కేంద్ర ప్రభుత్వం యజమానుల కోసం VISHWAS 2026 పేరిట ఒక వన్-టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్ కూడా ప్రవేశపెట్టింది. పీఎఫ్ బకాయిలు, ఆలస్యంగా చెల్లించే పెనాల్టీల భారాన్ని తగ్గించుకోవడానికి డిసెంబర్ 28, 2026 వరకు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆలస్య కాలం ఆధారంగా పెనాల్టీని భారీగా తగ్గించడం ద్వారా కంపెనీలకు ప్రభుత్వం ఊరట కల్పించింది.