బ్యాంకులో తాకట్టుపెట్టిన గోల్డ్ దొంగిలించబడితే కస్టమర్‌కి ఎంత చెల్లిస్తారు?

బ్యాంకులో తాకట్టుపెట్టిన గోల్డ్ దొంగిలించబడితే కస్టమర్‌కి ఎంత చెల్లిస్తారు?

గోల్డ్ లోన్ తీసుకునేటప్పుడు మనం విలువైన బంగారు ఆభరణాలను బ్యాంకు కస్టడీలో ఉంచుతాము. ఒకవేళ ఆ గోల్డ్ దొంగతనానికి గురైతే ఆ నష్టం ఎవరిది? కస్టమర్‌కు పరిహారం ఎలా లభిస్తుంది? అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ మెదులుతోంది. అయితే గోల్డ్ లోన్ తీసుకున్నంత మాత్రాన ఆభరణాలపై హక్కులు లెండర్‌కు పూర్తిగా మారిపోవు. రిజర్వు బ్యాంక్ రూల్స్ ప్రకారం.. తాకట్టు పెట్టిన బంగారాన్ని సురక్షితంగా భద్రపరిచే బాధ్యత పూర్తిగా బ్యాంకుదే.

బ్యాంకులు తమ సేఫ్ వాల్ట్‌లలో కస్టమర్ల బంగారాన్ని తగిన భద్రతా ఏర్పాట్లతో కాపాడాలి. తాకట్టు పెట్టిన ఆభరణాలకు తగిన ఇన్సూరెన్స్ రక్షణ కల్పించడం కూడా లెండర్ల బాధ్యతే. ఒకవేళ లెండర్ కస్టడీలో ఉన్న బంగారం దొంగతనానికి గురైతే.. ఆ నష్టానికి బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే దొంగతనం జరిగిన వెంటనే కస్టమర్లు కొన్ని కీలకమైన విషయాలపై స్పష్టత కలిగి ఉండాలి.

నష్ట పరిహారానికి సంబంధించి, బ్యాంకు వద్ద భద్రపరిచారనే కారణంతో అపరిమితమైన పరిహారం ఆటోమేటిక్‌గా లభించదు. దొంగతనం జరిగిన పరిస్థితులు, లెండర్ అగ్రిమెంట్ బాధ్యతలు, ఇన్సూరెన్స్ కవరేజ్, వర్తించే చట్టాల ఆధారంగా పరిహార మొత్తం ఆధారపడి ఉంటుంది. తీసుకున్న మొత్తం గోల్డ్ లోన్ ఎంత ఉందో.. అదే బంగారపు అసలు విలువ అని భావించకూడదు. బంగారపు నాణ్యత, బరువు, మార్కెట్ విలువ ఆధారంగానే లెండర్ లేదా ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారాన్ని లెక్కిస్తుంది. అందువల్ల ఈ విషయంలో బ్యాంక్ నుంచి అధికారిక స్పష్టతను రాతపూర్వకంగా తీసుకోవడం చాలా ముఖ్యం.

కుదువ పెట్టిన బంగారం పోయినంత మాత్రాన మీరు తీసుకున్న లోన్ ఆటోమేటిక్‌గా రద్దు కాదు. రుణం అనేది ఒక ప్రత్యేకమైన ఒప్పందం కాబట్టి.. తాకట్టు పెట్టిన సెక్యూరిటీ మాయమైనప్పటికీ కట్టాల్సిన లోన్ బాధ్యత అలాగే ఉంటుంది. బ్యాంక్ లేదా ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించే పరిహార మొత్తం మీ బకాయిలను ఎలా సర్దుబాటు చేస్తుందనేది రాతపూర్వకంగా తెలుసుకోవాలి. అంతేకాకుండా లోన్ డిఫాల్ట్ కారణంగా బ్యాంకు చేసే నిబంధనల ప్రకారమైన వేలానికి, దొంగతనానికి చాలా తేడా ఉంది. ఒకవేళ బ్యాంకు సహాయం చేయడానికి నిరాకరిస్తే.. ముందుగా వారి అధికారిక గ్రీవెన్స్ సెల్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలి. సమస్య పరిష్కారం కాకపోతే RBI ఓంబ్‌డ్యుమన్ ఫ్రేమ్‌వర్క్‌ను సంప్రదించొచ్చు కస్టమర్లు.

ఈ ప్రక్రియలో ప్లెడ్జ్ రిసిప్ట్, లోన్ అగ్రిమెంట్, వాల్యుయేషన్ రిపోర్ట్, పోలీస్ కంప్లైంట్ కాపీ వంటి పత్రాలు అత్యంత కీలకం. బ్యాంకులు గోల్డ్ లోన్ ఇచ్చేటప్పుడు ఆభరణాల వివరణ, బరువు, స్వచ్ఛతను పక్కాగా రికార్డు చేస్తారు. ఒరిజినల్ రశీదులు, కొనుగోలు బిల్లులు, ఫోటోలను భద్రపరుచుకోవడం ద్వారా భవిష్యత్తులో జరిగే వివాదాలను సులభంగా పరిష్కరించుకోవచ్చు.