అమెరికాకు ప్రపంచంలోనే తక్కువ వడ్డీకి అప్పులు దొరకాలె.. ఆ దేశాలతో వ్యాపారం బంద్ చేస్తా: ట్రంప్

అమెరికాకు ప్రపంచంలోనే తక్కువ వడ్డీకి అప్పులు దొరకాలె.. ఆ దేశాలతో వ్యాపారం బంద్ చేస్తా: ట్రంప్

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానంపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ వెంటనే వడ్డీ రేట్లను తగ్గించకపోతే.. అమెరికా వాణిజ్య లోటును ఎదుర్కొంటున్న దేశాలతో బిజినెస్ చేయటం పూర్తిగా నిలిపివేస్తానని హెచ్చరించారు. ప్రపంచంలోనే తక్కువ బారోయింగ్ కాస్ట్స్ కలిగిన దేశంగా అమెరికా ఉండాలని.. లేనిపక్షంలో అది దేశ ఆర్థిక పోటీతత్వానికి విఘాతం కలిగిస్తుందని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా స్పష్టం చేశారు. బలమైన ఆర్థిక వృద్ధి ద్రవ్యోల్భణ భయాలను పెంచకూడదని, తక్కువ వడ్డీ రేట్లే ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తాయని అన్నారు.

ఆగస్టు నెలలో అమెరికా జాబ్స్ రిపోర్ట్ అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా లక్షా 62వేల ఉద్యోగాలను సృష్టించింది. నిరుద్యోగ రేటు 4.1 శాతంగా నిలవడంతో, ఫెడ్ రిజర్వ్ సెప్టెంబర్ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపుపై పునరాలోచనలో పడింది. దీనికి విరుద్ధంగా.. వడ్డీ రేట్లను మరింత తగ్గించాలంటూ ట్రంప్ ఫెడ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం టారిఫ్స్ హెచ్చరికలతో ఆగకుండా, వాణిజ్య లోటు ఉన్న దేశాలతో ట్రేడింగ్ కట్ చేస్తాననడం సరికొత్త సంచలనానికి దారితీసింది. 

గత ఏడాది చైనా, మెక్సికో, వియత్నాం వంటి దేశాలతో అమెరికా భారీ ట్రేడ్ డెఫిసిట్ చవిచూసింది. తాజా జూలై గణాంకాల ప్రకారం అమెరికా వాణిజ్య లోటు 88.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. ముఖ్యంగా ఏఐ డేటా సెంటర్లు, కంప్యూటర్లు, సెమీకండక్టర్ల దిగుమతులు విపరీతంగా పెరగడం ఈ లోటుకు ప్రధాన కారణమని తేలింది.

ట్రంప్ హెచ్చరికలు కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితం కాకుండా.. అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అమెరికన్ వ్యాపారాలు దిగుమతులపై భారీగా ఆధారపడి ఉన్నందున, వాణిజ్యాన్ని నిలిపివేసే నిర్ణయం దేశంలో తీవ్రమైన సరఫరా కొరతకు, ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఇది ద్రవ్యోల్భణాన్ని మరింత పెంచే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 15-16 తేదీల్లో జరగనున్న ఫెడరల్ రిజర్వ్ సమావేశానికి ముందు వెలువడే ద్రవ్యోల్భణ గణాంకాలు వడ్డీ రేట్ల దిశను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఫెడ్ రిజర్వ్ ని టార్గెట్ చేస్తూ ట్రంప్ చేసిన కామెంట్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.