టైగర్ ష్రాఫ్‌పై దాడికి ర్యాపిడోకి సంబంధం ఏంటి..? కంపెనీ ఏమని చెప్పిందంటే..

టైగర్ ష్రాఫ్‌పై దాడికి ర్యాపిడోకి సంబంధం ఏంటి..? కంపెనీ ఏమని చెప్పిందంటే..

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముంబై పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. వీరిలో ఒకరు 'ర్యాపిడో'లో బైక్-టాక్సీ రైడర్‌గా పని చేసినట్లు తేలింది.

ఘటనలో ర్యాపిడో పాత్ర ఏంటి?
అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులలో హ్రితిక్ కుర్మి అలియాస్ రోషన్ ఫైటర్ (22) ఒకరు. ఇతను గతంలో ర్యాపిడో ప్లాట్‌ఫారమ్‌లో 'కెప్టెన్'గా రిజిస్టర్ అయ్యాడు. నిందితుడు ఇదే సాకుతో టైగర్ ష్రాఫ్ ఇల్లు ఉన్న జుహు ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఈ ఘటనకు ర్యాపిడో కంపెనీకి ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు. గిగ్ ఎకానమీలో సర్వసాధారణంగా జరిగేలా.. సదరు వ్యక్తి ఒకే సమయంలో అనేక ప్లాట్‌ఫారమ్‌లలో రిజిస్టర్ అయి ఉండవచ్చని తేలింది.

ర్యాపిడో కంపెనీ రియాక్షన్..
ఈ పరిణామాలపై స్పందిస్తూ ర్యాపిడో అధికారిక ప్రకటన విడుదల చేసింది. సదరు నిందితుడు తమ ప్లాట్‌ఫారమ్‌లో రైడర్‌గా రిజిస్టర్ అయ్యాడని మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. అయితే అక్టోబర్ 14వ తేదీ తర్వాత నుంచి అతను తమ ప్లాట్‌ఫారమ్‌లో యాక్టివ్‌గా లేడని స్పష్టం చేసింది. కాల్పులు జరిగిన రోజున ఆ నిందితుడు ర్యాపిడో సేవలను ఒక కస్టమర్‌గా మాత్రమే యూజ్ చేసుకున్నట్లు ర్యాపిడో స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తు విషయంలో తాము ముంబై పోలీసులకు సహకరిస్తున్నామని, అధికారులు అడిగిన అన్ని వివరాలను అందజేస్తున్నామని ర్యాపిడో వెల్లడించింది.

ఆదివారం సాయంత్రం ముంబైలోని జుహు ప్రాంతంలో టైగర్ ష్రాఫ్ కారును టార్గెట్ చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ష్రాఫ్ తృటిలో ప్రాణాలతో బయటపడగా.. ఆయన డ్రైవర్, మరో వ్యక్తి గాయపడ్డారు. ఈ దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా.. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు వేగవంతం చేశారు.