- బ్రిక్‌వర్క్ రేటింగ్స్ రిపోర్ట్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో (హెచ్2) మౌలిక సదుపాయాలు, విద్యుత్ రంగాలు భారీగా నిధులను ఆకర్షించే అవకాశం ఉందని బ్రిక్‌వర్క్ రేటింగ్స్ (బీడబ్ల్యూఆర్) నివేదిక వెల్లడించింది. సేవల రంగంలో కమర్షియల్ రియల్ ఎస్టేట్, ఎన్‌బీఎఫ్‌సీ విభాగంలో బంగారు రుణాలు, ఆస్తుల తనఖా రుణాలు రుణ వృద్ధికి ఊతమివ్వనున్నాయి. ఆఫీస్ లీజింగ్‌లో హైదరాబాద్ టాప్‌లో నిలిచింది.
మైక్రోఫైనాన్స్ వాటా ఎక్కువగా ఉన్న చిన్న ఎన్‌బీఎఫ్‌సీలు ఒత్తిడిలోనే ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య భారత కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్ బలంగా ఉంది. ప్రతి డౌన్‌గ్రేడ్‌కు 2.7 అప్‌గ్రేడ్‌లు నమోదు కాగా, డౌన్‌గ్రేడ్‌లు 11 శాతం తగ్గాయి. బీడబ్ల్యూఆర్ రేటింగ్ ఇచ్చిన సంస్థల్లో ప్రతి డౌన్‌గ్రేడ్‌కు 3.3 అప్‌గ్రేడ్‌లు నమోదయ్యాయి. కార్పొరేట్ రుణ నిష్పత్తి 2020లో 1.1 రెట్లు ఉండగా 2025 నాటికి 0.7 రెట్లకు తగ్గింది. ఆగస్టు 2026లో బ్యాంకుల నాన్ ఫుడ్ క్రెడిట్ 18.8 శాతం, సేవల రంగ రుణాలు 24.3 శాతం పెరిగాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది.
