- రూ.6,294 కోట్లతో 7,445 కిలోమీటర్ల మేర 2,145 రోడ్ల నిర్మాణం
- గడువు 30 నెలలైనా.. 18 నెలల్లోనే పూర్తి చేయాలని సర్కారు ఆదేశం
- పనుల ప్రగతిని బట్టి 10 విడతల్లో బిల్లుల చెల్లింపు
- 3 నెలలకోసారి 10 శాతం..
- దీపావళి తర్వాతే పనులు షురూ..
హైదరాబాద్, వెలుగు: పల్లెల్లో రవాణా కష్టాలకు చెక్ పెడుతూ నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి విడత కింద హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) విధానంలో చేపట్టనున్న రహదారుల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 7,445 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 2,145 రోడ్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.6,294 కోట్లను ఖరారు చేసింది. మొత్తం 17 ప్యాకేజీలుగా విభజించి పిలిచిన ఈ టెండర్లకు లైన్ క్లియర్ అయ్యింది.
దీపావళి పండుగ ముగియగానే క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. హ్యామ్ విధానం ప్రకారం ఈ ప్రాజెక్టును 40:60 నిష్పత్తిలో చేపట్టనున్నారు. ఇందులో ప్రభుత్వ వాటా కింద రూ.2,500 కోట్లను సర్కారు చెల్లించనుండగా, మిగిలిన రూ.3,500 కోట్లను కాంట్రాక్ట్ సంస్థలే సమకూర్చుకోనున్నాయి. కాంట్రాక్టర్లతో పదిహేడున్నర సంవత్సరాల కాలపరిమితితో అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నారు.
ఇందులో నిర్మాణ కాలంతోపాటు రహదారుల దీర్ఘకాలిక నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టర్లదే కానుంది. కాగా, రాష్ట్రంలో పిలిచిన 17 ప్యాకేజీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన సంస్థలు కేవలం 3 ప్యాకేజీలను మాత్రమే దక్కించుకోగా, మిగిలిన 14 ప్యాకేజీల పనులను ఇతర రాష్ట్రాలకు చెందిన దిగ్గజ నిర్మాణ సంస్థలు దక్కించుకోవడం విశేషం.
30 నెలల గడువున్నా.. 18 నెలల్లోనే పనులు పూర్తి చేయాలి..
ఈ ప్రాజెక్టు నిబంధనల ప్రకారం నిర్మాణ పనులను పూర్తి చేయడానికి 30 నెలల గడువు ఉంది. అయితే, గ్రామీణ ప్రజలకు వీలైనంత త్వరగా మెరుగైన రవాణా సౌకర్యాలు అందించాలన్న కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వం.. గడువు కంటే 12 నెలల ముందే, అంటే కేవలం 18 నెలల్లోనే పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను, ఏజెన్సీలను ఆదేశించింది. ఇందుకోసం ఇప్పటికే కాంట్రాక్ట్ సంస్థలు సైట్లలో మెటీరియల్ సమీకరణ, క్యాంపుల ఏర్పాటు, స్టోన్ క్రషర్లు, బీటీ ప్లాంట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేశాయి.
అయితే, హ్యామ్ విధానంలో నిధుల వినియోగం పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. కాంట్రాక్టర్లకు ఒకేసారి బిల్లులు ఇవ్వకుండా, పనుల పురోగతి ఆధారంగా నిధులు విడుదల చేయనున్నారు. నిర్మాణ దశలో ప్రతి 3 నెలలకోసారి పనుల ప్రగతిని సమీక్షించి, 10 శాతం చొప్పున మొత్తం 10 విడతల్లో నిధులు జమ చేస్తారు. రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత అగ్రిమెంట్ ప్రకారం నిర్వహణ కాలానికి సంబంధించి ప్రతి 6 నెలలకోసారి యాన్యుటీ ఇన్స్టాల్మెంట్ రూపంలో ఏజెన్సీలకు చెల్లింపులు చేయనున్నారు. దీనివల్ల నాణ్యతతోపాటు పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంటుంది.
దీపావళి తర్వాతే పనులు షురూ..
వాస్తవానికి ఈ పనులను దసరా పండుగ నాటికే ప్రారంభించాలని సర్కారు భావించినప్పటికీ, టెండర్ల స్క్రూట్నీ, పరిశీలన ప్రక్రియలో స్వల్ప జాప్యం జరిగింది. తాజాగా టెండర్లు కొలిక్కి రావడంతో దీపావళి పండుగ వెనువెంటనే క్షేత్రస్థాయిలో పనులు మొదలుపెట్టేందుకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మూడు దశల్లో 18 వేల కిలోమీటర్ల మేర హ్యామ్ రోడ్ల ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించగా, తొలి విడత పనులు కొలిక్కి రాగానే తదుపరి రెండు, మూడు దశలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నది.
కరీంనగర్లో రోడ్లు ఎక్కువ.. మెదక్‌లో కిలోమీటర్లు ఎక్కువ..
రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం పరిధిలోని 17 సర్కిళ్ల వారీగా రోడ్ల సంఖ్య, కిలోమీటర్ల లెక్కలను ప్రభుత్వం ఖరారు చేసింది. రోడ్ల సంఖ్య పరంగా చూస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలకే పెద్దపీట దక్కింది. కరీంనగర్ సర్కిల్లో అత్యధికంగా 197 రోడ్లు మంజూరు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో నిజామాబాద్‌లో 183, ఖమ్మంలో 175, మెదక్‌లో 166, వరంగల్‌లో 153 రోడ్లు దక్కాయి. భువనగిరి సర్కిల్‌కు 136, ఆదిలాబాద్‌కు 134, సిద్దిపేటకు 132, రంగారెడ్డికి 125 రోడ్లు కేటాయించారు.
అలాగే మహబూబాబాద్ సర్కిల్ పరిధిలో 117, వికారాబాద్‌లో 114, నల్గొండలో 104 రోడ్లు మంజూరు కాగా, మహబూబ్‌నగర్‌కు 99, పెద్దపల్లికి 88, సూర్యాపేటకు 86, మంచిర్యాలకు 85, వనపర్తికి 68 రోడ్ల చొప్పున కేటాయించారు. 586 కిలోమీటర్లతో మెదక్ సర్కిల్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవగా, 555.13 కిలోమీటర్లతో ఆదిలాబాద్ రెండో స్థానంలో ఉంది. తర్వాత కరీంనగర్ 541.15 కి.మీ, ఖమ్మం 524.37 కి.మీ, నిజామాబాద్ 514.20 కి.మీ, మహబూబ్‌నగర్ 513.81 కి.మీ సర్కిళ్లు ఐదొందల కిలోమీటర్ల మార్కును దాటేశాయి.
ఆ తర్వాత సిద్దిపేట 484.96 కి.మీ, వరంగల్ 477.34 కి.మీ, రంగారెడ్డి 428.15 కి.మీ, భువనగిరి 426.83 కి.మీ, నల్గొండ 408.19 కి.మీ, మహబూబాబాద్ 364.59 కి.మీ, మంచిర్యాల 358.16 కి.మీ, సూర్యాపేట 357.52 కి.మీ, వనపర్తి 333.46 కి.మీ, వికారాబాద్ 325.13 కి.మీ, పెద్దపల్లి 249.89 కి.మీ మేర రోడ్ల పనులు చేపట్టనున్నారు. కాగా, ప్రాథమికంగా సర్కిళ్ల వారీగా 2,162 రోడ్లు (7,448.95 కి.మీ) ప్రతిపాదించినప్పటికీ, క్షేత్రస్థాయి పరిశీలన, వెట్టింగ్ అనంతరం సాంకేతిక కారణాలతో కొన్నింటిని మినహాయించి తుది జాబితాలో 2,145 రోడ్లను (7,445 కి.మీ) ఖరారు చేశారు.
గజ్వేల్‌కు నిధుల వరద.. వంద కోట్ల క్లబ్లో 11 సెగ్మెంట్లు..
మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రోడ్లు, నిధుల కేటాయింపులను పరిశీలిస్తే, గజ్వేల్ సెగ్మెంట్ రాష్ట్రంలోనే రికార్డు స్థాయి వాటాను దక్కించుకుంది. ఇక్కడ అత్యధికంగా 61 రోడ్ల కోసం 220.51 కిలోమీటర్లకు రూ.200.91 కోట్ల నిధులను ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ తర్వాత మహబూబాబాద్ నియోజకవర్గానికి 56 రోడ్లు (131.65 కి.మీ) కేటాయించి రూ.116.44 కోట్లు మంజూరు చేసింది. తాండూరు సెగ్మెంట్‌కు 47 రోడ్లకు (80.47 కి.మీ) రూ.50.32 కోట్లు, డోర్నకల్‌కు 45 రోడ్లకు (167.18 కి.మీ) రూ.142.56 కోట్లు, ఆందోల్‌కు 44 రోడ్లకు (138.11 కి.మీ) రూ.106.22 కోట్లు, కామారెడ్డికి 42 రోడ్లకు (116.85 కి.మీ) రూ.75.19 కోట్లు కేటాయించారు.
అలాగే మేడ్చల్ మల్కాజిగిరి, జనగామ, వర్ధన్నపేట నియోజకవర్గాలకు ఒక్కోదానికి 41 రోడ్ల చొప్పున దక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 11 నియోజకవర్గాలకు వంద కోట్ల రూపాయలకుపైగా నిధులు దక్కడం గమనార్హం. వంద కోట్ల క్లబ్లో చేరిన నియోజకవర్గాల్లో ఆసిఫాబాద్ అగ్రభాగాన నిలిచింది. ఇక్కడ 38 రోడ్ల నిర్మాణం (186.68 కి.మీ) కోసం రూ.185.35 కోట్లు వెచ్చించనున్నారు. వీటితోపాటు షాద్‌నగర్‌కు 29 రోడ్లకు (139.76 కి.మీ) రూ.154.53 కోట్లు, అలేరుకు 32 రోడ్లకు (142.93 కి.మీ) రూ.140.98 కోట్లు, నాగార్జునసాగర్‌కు 37 రోడ్లకు (172.68 కి.మీ) రూ.137.32 కోట్లు, మక్తల్‌కు 18 రోడ్లకే (103.46 కి.మీ) రూ.131.43 కోట్లు మంజూరయ్యాయి. నర్సాపూర్‌కు 29 రోడ్లకు (136.93 కి.మీ) రూ.125.72 కోట్లు, దేవరకొండకు 32 రోడ్లకు (115.52 కి.మీ) రూ.125.27 కోట్లు, జడ్చర్లకు 19 రోడ్లకు (109.58 కి.మీ) రూ.116.65 కోట్ల నిధులను కేటాయించారు.
