- అడవుల్లో అడుగంటుతున్న కుంటలు, వాగులు, చెక్‌డ్యాంలు
- పచ్చిక లేక ఆకలితో, దాహంతో అలమటిస్తున్న వన్యప్రాణులు
- సిటీలో పావురాలు, పల్లెల్లో కోతులు తండ్లాట
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ప్రభావంతో అడవుల్లో నీటి కష్టాలు సీజన్‌కు ముందుగానే మొదలయ్యాయి. సాధారణంగా అక్టోబర్ నెలలో వర్షాలు తగ్గి చలిగాలులు ప్రారంభం కావాల్సి ఉండగా, ఈసారి ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈసారి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, చలికాలానికి ముందే ఎండలు తీవ్రం కావడంతో జలవనరులు క్రమంగా అడుగంటుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటుతుండడంతో అడవుల్లో పచ్చిక ఎండిపోతోంది. దీంతో పశుగ్రాసం, నీటి కొరత కొరత ఏర్పడి వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. అటవీశాఖ ఆఫీసర్లు తక్షణ చర్యలు తీసుకోకపోతే వన్యప్రాణుల మనుగడ ప్రమాదంలో పడుతుందని జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకిపోతున్న ఊటలు.. జంతువుల తిప్పలు..
నల్లమలలోని పెదవాగు, డిండి, కవ్వాల్‌లోని కడెం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రవాహాలు, గోదావరి పరీవాహక చిన్న వాగులు ముందే ఇంకిపోతున్నాయి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ అడవుల్లో కాంపా, ఉపాధి హామీ నిధులతో నిర్మించిన 3,000 పైగా చెక్‌డ్యాంలు ఎండిపోతున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని ఫర్హాబాద్, పాతాళగంగ లోయల వైపు ఉన్న 40కి పైగా సోలార్ యూనిట్లు రిపేర్లకు వచ్చాయి.
దీంతో ఎత్తైన కొండ ప్రాంతాల్లోని జంతువులు నీటి కోసం కృష్ణానది లోయల్లోకి దిగుతూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని జన్నారం, ఇందన్‌పల్లి రేంజ్‌లలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. గతంలో 150 అడుగులకే నీళ్లు పడేచోట ఇప్పుడు 300 అడుగులు వేసినా నీరు రాకపోవడంతో ఉన్న సోలార్ పంపులు కూడా గంటల వ్యవధిలోనే ఆగిపోతున్నాయి.
అటవీశాఖ అలర్ట్..
అడవుల్లో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. ఫిబ్రవరిలో చేయాల్సిన ఏర్పాట్లు నవంబర్లోనే చేపట్టేందుకు ముందస్తు ప్లాన్ రెడీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,500 సాసర్ పిట్లలో సగానికి పైగా మట్టి పేరుకుపోయి, బీటలు వారి దర్శనమిస్తుండడంతో మరమ్మతులు చేపట్టడంపై దృష్టిసారించారు. ఫారెస్ట్ ట్రాక్స్ ద్వారా ట్యాంకర్ల సిబ్బంది నీళ్లు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని 680 సోలార్ బోర్లలో 230 యూనిట్ల బ్యాటరీలు పాడవడం, కోతులు వైర్లు కొరికేయడంతో నిరుపయోగంగా మారాయి. వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు.
అడవుల్లో తవ్విన 1,800 కృత్రిమ కుంటలు ఎండిపోకుండా, సాసర్ పిట్లకు చాలాచోట్ల ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. పలు ప్రాంతాల్లో సాసర్ పిట్లలో ఎండుటాకులు, దుమ్ము, పక్షుల రెట్టలు పడి నీరు కలుషితమవుతోంది. కొన్ని ప్రాంతాల్లో అడవి దున్నలు, పెంపుడు పశువుల తాకిడికి, ఎండిన చెట్ల కొమ్మలు పడి సిమెంట్ తొట్లు పగిలిపోయాయి. మరోవైపు సోలార్ బోర్ల నిర్వహణపై పర్యవేక్షణ కొరవడింది. గత వర్షాకాలంలో పిడుగుల కారణంగ పాడైన సోలార్ ప్యానెల్స్‌ను బాగుచేయకపోవడం, అమ్రాబాద్, ఏటూరునాగారం వంటి లోపలి ప్రాంతాల్లో కోతులు, లంగూర్లు వైర్లను కొరికడం, ప్యానెల్స్‌పై దుమ్ము పేరుకుపోవడంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గి పంపులు నీటిని తోడలేక నిలిచిపోతున్నాయి.
ఇటు ఆకలి, అటు దాహం..
ఎల్ నినో ఎఫెక్ట్‌తో తేమశాతం పడిపోయి అడవుల్లోని సహజసిద్ధ ఊటలు, వాగులు, వంకలు క్రమంగా ఇంకిపోతున్నాయి. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లతోపాటు ఏటూరునాగారం, పాఖాల, కిన్నెరసాని అభయారణ్యాల్లోని చిన్న చెక్‌డ్యాంలు, కుంటలు కూడా డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. కరువుతో పచ్చిక బయళ్లు కూడ ఎండిపోతుండటంతో రానున్న రోజుల్లో మూగజీవాలకు గడ్డి దొరకడం కష్టంగ మారనుంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో సుమారు వేల సంఖ్యలో ఉన్న జింకలు, సాంబార్లు, అడవి దున్నలు మరణించే ప్రమాదముందని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీరు, మేత వెతుక్కుంటూ అటవీ సరిహద్దులోని వ్యవసాయ పొలాల్లోకి వచ్చే చాన్స్ ఉంది. దీంతో రోడ్డు ప్రమాదాలు, వేటగాళ్ల ఉచ్చులకు బలయ్యే ముప్పు పెరుగుతుంది. అడవిలో మిగిలిన కొద్దిపాటి నీటిగుంతలు కలుషితమైతే వాటిని తాగే వన్యప్రాణులు ఆంత్రాక్స్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెప్తున్నారు. అడవిలో ఎండుటాకులు పెరిగిపోవడంతో కార్చిచ్చులు చెలరేగితే చిన్న జీవులు, పక్షులు సజీవదహనమయ్యే
అవకాశం ఉంది.
పల్లెల్లో కోతులు, నగరాల్లో పక్షులు..
అడవుల్లో నీరు, ఆహారం దొరక్క కోతులు ఇప్పటికే గ్రామాల బాట పట్టాయి. అనేక గ్రామాల్లో వందల సంఖ్యలో కోతులు సంచరిస్తుండటంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుక్కెడు నీటి కోసం ఇండ్లలోకి చొరబడుతుండగా, సింటెక్స్ ట్యాంకులు, కుళాయిలు, బావులు, పశువుల తొట్ల వద్ద గుంపులుగా చేరుతున్నాయి. తలుపులు, కిటికీలు తెరిచి ఉంటే వంటగదులు, బాత్రూమ్‌లలోకి చొరబడి తాగునీటి పాత్రలను ఒలకబోస్తున్నాయి. వాటిని తరిమేందుకు ప్రయత్నిస్తుండగా దాడులకు దిగుతున్నాయని రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లోనూ పక్షుల పరిస్థితి దయనీయంగ మారింది.
పావురాలు, పిచ్చుకలు తాగునీటి కోసం ఏసీ ఔట్‌డోర్ యూనిట్ల నుంచి కారే నీటి బొట్ల వద్దకు, డక్టులు, బాత్రూమ్ వెంటిలేటర్ల సందుల్లోకి చేరుతున్నాయి. హైదరాబాద్‌లో చార్మినార్, మొజాంజాహి మార్కెట్, కోఠి, సికింద్రాబాద్ క్లాక్ టవర్, రైల్వే స్టేషన్, బేగంబజార్, ఛత్తా బజార్, కాచిగూడ, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, హైటెక్ సిటీ-, గచ్చిబౌలి హైరైజ్ భవనాల్లో పావురాలు నివసిస్తున్నాయి. జనం వీటికి గింజలు వేస్తున్నా.. తాగడానికి శుభ్రమైన నీరు లేక డిహైడ్రేషన్కు గురవుతున్నాయి.
