దేశంలో శాశ్వత అధికారం కోసం కుట్రలు..అందుకే కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

దేశంలో శాశ్వత అధికారం కోసం కుట్రలు..అందుకే కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు:  పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  •     రాహుల్ నాయకత్వం వైపు జనం చూపు: మంత్రి ఉత్తమ్​
  •     చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన సమావేశం
  •     డాక్టర్ మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌కు సద్భావన అవార్డు ప్రదానం

హైదరాబాద్, వెలుగు: దేశంలో శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. అందుకే కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ సద్భావన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశం ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ సద్భావన యాత్రను స్ఫూర్తిగా తీసుకొని మత సామరస్యం, సామాజిక ఐక్యతను కాపాడేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. 

దేశంలో నిశ్శబ్ద విప్లవం కొనసాగుతోంది..

దేశంలో నిశ్శబ్ద విప్లవం కొనసాగుతోందని, రాహుల్ గాంధీ నాయకత్వం వైపు దేశ ప్రజలు చూస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దేశంలో రోజురోజుకూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ప్రజా మద్దతు పెరుగుతోందన్నారు. బీజేపీని ఓడించి, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, జాతీయ సమైక్యతను బలోపేతం చేసే పోరాటంలో రాహుల్ గాంధీకి ప్రతిఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ మాట్లాడుతూ బీజేపీ పాలనలో దేశంలో హింస, అల్లర్లు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి దేశ ప్రజలంతా అండగా నిలుస్తున్నారని తెలిపారు. అనంతరం ప్రముఖ వైద్యులు, ఏఐఎన్‌‌‌‌‌‌‌‌యూ ఎండీ సి. మల్లికార్జున్‌‌‌‌‌‌‌‌కు 'రాజీవ్ సద్భావన అవార్డు' అందజేశారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.