ఎస్సీ, ఎస్టీ సబ్‌‌‌‌‌‌‌‌ప్లాన్‌‌‌‌‌‌‌‌ నిధుల ఖర్చులో స్పీడ్ పెంచాలి : డిప్యూటీ సీఎం భట్టి

ఎస్సీ, ఎస్టీ సబ్‌‌‌‌‌‌‌‌ప్లాన్‌‌‌‌‌‌‌‌ నిధుల ఖర్చులో  స్పీడ్ పెంచాలి : డిప్యూటీ సీఎం భట్టి
  • వెనుకబడిన శాఖలపై దృష్టి పెట్టండి: డిప్యూటీ సీఎం భట్టి  
  •     ఆర్థిక సంస్కరణలు, ఆదాయ సమీకరణ, రుణాల రీస్ట్రక్చరింగ్‌‌‌‌‌‌‌‌పై ఫోకస్
  •     మెరుగైన నిర్వహణకు నిపుణులు, కన్సల్టెంట్ల సేవలు తీసుకోవాలని ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాన్‌‌‌‌‌‌‌‌ నిధుల ఖర్చులో వేగం పెంచాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో కేటాయించిన నిధులను వంద శాతం వినియోగించాలని స్పష్టం చేశారు. సబ్‌‌‌‌‌‌‌‌ప్లాన్‌‌‌‌‌‌‌‌ అమలు, శాఖల వారీగా ఖర్చులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సోమవారం సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జనాభా ప్రాతిపదికన చట్టబద్ధంగా కేటాయించిన నిధుల ఖర్చులో నిర్లక్ష్యం, జాప్యాన్ని సహించేది లేదని తేల్చిచెప్పారు. సాధారణ బడ్జెట్‌‌‌‌‌‌‌‌ పద్దుల మాదిరిగానే ప్రత్యేక పద్దుల కింద కేటాయించిన ప్రతి రూపాయినీ నిర్దేశిత లక్ష్యాలకే ఖర్చు చేయాలన్నారు. ఇప్పటివరకు నిధుల ఖర్చులో తీవ్ర అంతరాలు ఉన్నాయని గుర్తించారు. బడ్జెట్‌‌‌‌‌‌‌‌ కేటాయింపులకు, క్షేత్రస్థాయి వ్యయానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వెంటనే పూడ్చాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.

స్పీడప్​కోసం యాక్షన్​ప్లాన్

సబ్‌‌‌‌‌‌‌‌ప్లాన్‌‌‌‌‌‌‌‌ నిధుల వినియోగంలో లక్ష్యాల కంటే వెనుకబడిన శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని భట్టి విక్రమార్క సూచించారు. ఖర్చులో ఎక్కువ వ్యత్యాసం ఉన్న కీలక శాఖలను గుర్తించి, వ్యయాన్ని వేగవంతం చేసేందుకు తక్షణ కార్యాచరణ రూపొందించాలన్నారు. వ్యవసాయం, వైద్యారోగ్యం, విద్యుత్‌‌‌‌‌‌‌‌, పురపాలక, పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌, సాంఘిక సంక్షేమం, పరిశ్రమలు, గిరిజన సంక్షేమ శాఖల కార్యదర్శులతో ఆర్థిక శాఖ అధికారులు త్వరలో వరుస సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయా శాఖలకు కేటాయించిన బడ్జెట్‌‌‌‌‌‌‌‌, ఇప్పటివరకు చేసిన ఖర్చు, మిగిలిన నిధులను గడువులోగా వినియోగించే ప్రణాళికపై చర్చించి సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. పథకాల అమలులో క్షేత్రస్థాయి అడ్డంకులను తొలగించాలని సూచించారు. దళిత, గిరిజన వర్గాల సంక్షేమానికి కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా చూడాలన్నారు.  

ఆర్థిక స్థిరత్వం కాపాడాలి

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఆర్థిక శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చే మార్గాలను అన్వేషించాలన్నారు. గత పాలనలో పేరుకుపోయిన రుణభారాన్ని తగ్గించేందుకు రుణాల పునర్వ్యవస్థీకరణ (డెట్‌‌‌‌‌‌‌‌ రీస్ట్రక్చరింగ్‌‌‌‌‌‌‌‌)పై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఆర్థిక నిర్వహణలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించేందుకు, ఆదాయ మార్గాలను పెంచేందుకు అనుభవజ్ఞులైన ఆర్థిక నిపుణులు, కన్సల్టెంట్ల సేవలను వినియోగించుకోవాలన్నారు. బడ్జెట్‌‌‌‌‌‌‌‌ కేటాయింపులు, వ్యయ నియంత్రణ, ఆర్థిక క్రమశిక్షణ మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలకు నిధుల కొరత రాకుండా చూస్తూనే రాష్ట్ర ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం కీలకమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌, ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ గౌరవ్‌‌‌‌‌‌‌‌ ఉప్పల్‌‌‌‌‌‌‌‌, ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ స్పెషల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ సిక్తా పట్నాయక్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.