Ranabaali Box Office: ‘రణబాలి’ బ్రేక్‌ఈవెన్ టార్గెట్ ఎంత? 3 రోజుల కలెక్షన్ల పరిస్థితి ఇది..

Ranabaali Box Office: ‘రణబాలి’ బ్రేక్‌ఈవెన్ టార్గెట్ ఎంత? 3 రోజుల కలెక్షన్ల పరిస్థితి ఇది..

విజయ్ దేవరకొండ నటించిన ‘రణబాలి’ బాక్సాఫీస్ దగ్గర హాట్ టాపిక్‌గా మారింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా.. తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.36.90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే, మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లు తగ్గాయి. ఆదివారం స్వల్పంగా పెరిగినా.. సినిమా ఇంకా ఆశించిన స్థాయిలో దూసుకెళ్లడం లేదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సోమవారం, మంగళవారం (దసరా రోజు) వసూళ్లపైనే ఉంది. సుమారు రూ.120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బ్రేక్‌ఈవెన్ టార్గెట్‌ను రీచ్ అవుతుందా? లేదా? అన్నది సినీ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.

మూడు రోజుల్లో రూ.36.90 కోట్లు..!

రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందిన ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్, రష్మిక జంటగా నటించడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అయితే విడుదల తర్వాత మిక్స్‌డ్ టాక్ రావడంతో కలెక్షన్లలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. సాక్‌నిల్క్ అంచనాల ప్రకారం సినిమా డే వైజ్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

    డే 1: రూ.9.25 కోట్ల ఇండియా నెట్

    డే 2: రూ.7.30 కోట్ల ఇండియా నెట్

    డే 3: రూ.7.50 కోట్ల ఇండియా నెట్

మూడు రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్లు రూ.24.05 కోట్లకు చేరాయి. ఇండియా గ్రాస్ రూ.28 కోట్లు కాగా, ఓవర్సీస్ నుంచి రూ.8.90 కోట్ల గ్రాస్ వచ్చింది. దీంతో వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.36.90 కోట్లు సాధించినట్లుగా తెలిపింది. శనివారంతో పోలిస్తే ఆదివారం కలెక్షన్లు 2.7 శాతం పెరిగాయి. అయితే మొదటి రోజు వచ్చిన రూ.9.25 కోట్ల నెట్‌ను మాత్రం సినిమా అందుకోలేకపోయింది. అంటే ఆదివారం కొంత పుంజుకున్నా.. బాక్సాఫీస్ జోరు ఇంకా పెరగాల్సి ఉంది.

‘రణబాలి’ బ్రేక్‌ఈవెన్ టార్గెట్ పెద్దదే!

మైత్రీ మూవీ మేకర్స్ ఏమాత్రం రాజీ పడకుండా సుమారు రూ. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ పీరియాడిక్ వార్ డ్రామాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ క్రమంలోనే ‘రణబాలి’ చిత్ర థియేట్రికల్ బిజినెస్ రూ. 60 కోట్ల రేంజ్‌లో జరిగినట్లు ట్రేడ్ పండితుల లెక్కలు చెబుతున్నాయి. అంటే సినిమా క్లీన్ హిట్‌గా నిలవాలన్నా, బయ్యర్లు లాభాల బాట పట్టాలన్నా బాక్సాఫీస్ వద్ద కనీసం రూ. 60 కోట్ల షేర్ (దాదాపు రూ.120 కోట్ల గ్రాస్) రావాల్సి ఉందని సమాచారం. ప్రస్తుతం మూడు రోజుల్లో వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.36.90 కోట్లు ఉండగా.. ఇంకా బ్రేక్ ఈవెన్ కావడానికి చాలా కష్టపడాల్సి ఉందని తెలుస్తోంది. 

బ్రేక్‌ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వాలంటే.. 

  • తెలుగు రాష్ట్రాల్లో సినిమా బలంగా నిలబడాలి.
  • దసరా పండుగకు కలెక్షన్లు పడిపోకూడదు.
  • ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరింత ఆదాయం రావాలి.
  • సెకండ్ వీక్ లోనూ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలి.

ఈ అంశాలు అనుకూలిస్తే సినిమా బ్రేక్‌ఈవెన్ దిశగా వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ సోమవారం నుంచే కలెక్షన్లు భారీగా పడిపోతే టార్గెట్ చేరుకోవడం కష్టమవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

విజయ్ దేవరకొండకు ఈ హిట్ ఎందుకు ముఖ్యం?

విజయ్ దేవరకొండకు ‘రణబాలి’ ఫలితం కీలకంగా మారింది. ‘టాక్సీవాలా’ తర్వాత ఆయన నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలకడైన విజయాన్ని అందుకోలేకపోయాయి. ‘లైగర్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘కింగ్‌డమ్’ వంటి సినిమాల ఫలితాల నేపథ్యంలో విజయ్‌కు మరో కమర్షియల్ హిట్ అవసరమనే చర్చ ఉంది.

ఇప్పుడు ‘రణబాలి’ కూడా మొదటి రోజు తర్వాత కలెక్షన్లలో తగ్గుదల చూపించడంతో ట్రేడ్ వర్గాలు ఈ సినిమా వీక్‌డే పెర్ఫార్మెన్స్‌పై దృష్టి పెట్టాయి. మరోవైపు రష్మిక మందన్నకు ‘పుష్ప’, ‘యానిమల్’, ‘చావా’ వంటి చిత్రాలతో మంచి మార్కెట్ ఉంది. ఈ జంటకు ఉన్న క్రేజ్ బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు ఉపయోగపడుతుందో రాబోయే రోజుల్లో తేలనుంది.

సోమవారం కలెక్షన్లే గేమ్ ఛేంజరా?

సినిమాకు తొలి వారాంతం కీలకమే. కానీ భారీ బడ్జెట్ సినిమాల విషయంలో అసలైన పరీక్ష సోమవారం నుంచే మొదలవుతుంది. ఆదివారం వచ్చిన స్వల్ప పెరుగుదల కొనసాగితే ‘రణబాలి’కి కొంత ఊరట లభిస్తుంది. అదే వసూళ్లు ఒక్కసారిగా పడిపోతే బ్రేక్‌ఈవెన్ రేసు మరింత కఠినంగా మారుతుంది. మొత్తానికి .. సోమవారం నుంచి వచ్చే వసూళ్లే సినిమా భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. మరి విజయ్ దేవరకొండకు ‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద కమ్‌బ్యాక్ హిట్ అవుతుందా? లేక మరోసారి నిరాశే మిగులుస్తుందా? వెయిట్ అండ్ వాచ్...