అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న భక్తికథా చిత్రం ‘కనకదుర్గ’. బీవీఎస్ రవి కథను అందించగా, ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నాడు. బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో భక్తితోపాటు యాక్షన్, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు మేకర్స్ తెలియజేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది.
నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. తమన్ కంపోజ్ చేసిన పాటకు సిరాశ్రీ సాహిత్యం అందించగా, అనంతు పాడిన విధానం ఆకట్టుకుంది. ‘లోకాలను ఏలేటి మా తల్లి దుర్గమ్మ.. కష్టాలు నష్టాలు తొలగించు మా అమ్మ.. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్నవమ్మ.. దుర్గమ్మ దుర్గమ్మ.. దిక్కు మొక్కు నువ్వమ్మ.. దుర్గమ్మ దుర్గమ్మ.. తల్లి కనకదుర్గమ్మ..’ అంటూ సాగిన పాట కనకదుర్గమ్మవారి దివ్యశక్తి, కరుణ, ఆధ్యాత్మిక విశిష్టతను ప్రతిబింబించేలా ఉంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో నరేష్ మాట్లాడుతూ ‘అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మా నాన్నఈవీవీ సత్యనారాయణ గారు విజయవాడ కనకదుర్గమ్మకు పరమ భక్తులు. నేను ఇప్పటివరకు ఎన్నో డిఫరెంట్ జానర్స్ చేశాను. అయితే తొలిసారి భక్తిరస చిత్రంలో నటిస్తున్నా. పాత్ర కోసం భవానీ దీక్ష నియమాలను పాటిస్తూ మాంసాహారానికి, పాదరక్షలకు దూరంగా ఉన్నాను. షూటింగ్ పూర్తయింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని చెప్పాడు. ఈ కార్యక్రమంలో టీమ్ అంతా పాల్గొన్నారు.
