Garividi Lakshmi: నా జీవిత కథను ప్రపంచానికి పరిచయం చేశారు.. గరివిడి లక్ష్మి ఎమోషనల్

Garividi Lakshmi: నా జీవిత కథను ప్రపంచానికి పరిచయం చేశారు.. గరివిడి లక్ష్మి ఎమోషనల్

ఏపీకి చెందిన జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఆనంది లీడ్ రోల్‌‌‌‌లో గౌరి నాయుడు జమ్ము తెరకెక్కించిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించగా,  ఈనెల 17న ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించి.. గరివిడి లక్ష్మిని సన్మానించింది.

ఈ సందర్భంగా గరివిడి లక్ష్మి మాట్లాడుతూ ‘నా జీవిత కథను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు గౌరి నాయుడుకు, నిర్మాతలకు కృతజ్ఞతలు. సినిమా చూసిన వాళ్లందరూ ఆనంది నాలాగే చేసిందని చెబుతుంటే ఆనందంగా అనిపించింది’ అని చెప్పారు.

ఈ సినిమా తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని,రెండేళ్ల కష్టానికి ప్రేక్షకుల ప్రశంసలు గొప్ప ఆనందాన్ని ఇచ్చాయని ఆనంది చెప్పింది. కష్టాలను అధిగమించి విజయం సాధించాలనే సందేశాన్ని ఈ సినిమా అందిస్తుందని దర్శకుడు గౌరి నాయుడు అన్నాడు.

బుర్రకథ వంటి గొప్ప జానపద కళారూపాన్ని నేటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మించామని, ప్రేక్షకుల ఆదరణ ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని  నిర్మాతలు విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ అన్నారు. టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమా విజయంపై సంతోషం వ్యక్తం చేసింది. 

‘గరివిడి లక్ష్మి’ కథేంటి?

విజయనగరం జిల్లా గరివిడికి చెందిన విజయలక్ష్మి (ఆనంది) చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటుంది. తండ్రి ప్రేమకు దూరమై, బాల్య వివాహం తర్వాత వైవాహిక జీవితంలోనూ చేదు అనుభవాలను చవిచూస్తుంది. అయితే, ఆ బాధలే ఆమె ప్రయాణానికి ముగింపు కావు. పాటపై ఉన్న మక్కువ, అసాధారణమైన ప్రతిభ ఆమెను బుర్రకథ కళాకారిణిగా తీర్చిదిద్దుతాయి. తన గళంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లక్ష్మి జీవితంలోకి సత్తిబాబు (రాగ్ మయూర్), రాంబాబు (నరేష్) రావడంతో కథ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంది.

నమ్మినవారి వల్ల ఎదురైన మోసాలు, తన కళకు దక్కాల్సిన గుర్తింపు దూరమవడం ఆమె జీవితాన్ని ఎలాంటి సంక్షోభంలోకి నెట్టాయి? చివరకు ఆమె అజ్ఞాతంలోకి వెళ్లడానికి కారణమేంటి? లక్ష్మి జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్న దర్శకుడు రాజేష్ (అంకిత్ కొయ్య) ప్రయత్నం ఫలించిందా? వంటి ప్రశ్నలకు సమాధానాలు  రావాలంటే సినిమా థియేటర్లలో చూడాల్సిందే..