ముంబై: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారు విండ్‌షీల్డ్, సైడ్ విండోపై దుండగులు మొత్తం ఐదు రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఓ షూటర్ కారులో ష్రాఫ్ కార్చున్న వైపుకు వెళ్లి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చేందుకు ప్రయత్నించాడు.
సరిగ్గా అదే సమయంలో షూటర్ తుపాకీ జామ్ అవ్వడం లేదా సాంకేతిక లోపంతో ఫైర్ కాలేదు. వెంటనే షూటర్ అక్కడి నుంచి బైక్ పరారయ్యాడు. దీంతో టైగర్ ష్రాఫ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. లేదంటే ష్రాఫ్‌కు పాయింట్ బ్లాంక్‌లో తూటాలు దూసుకెళ్లేవి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోల్లో ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతోంది.
టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా కాల్పులు
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా ముంబైలోని జుహూ ప్రాంతంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో హీరో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో 4 సార్లు తుపాకీ మోత వినిపించింది. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ డ్రైవర్ ఫిర్దౌస్ ఎడమ చేతికి గాయమైంది. పక్కనే ఉన్న మరో ఆటో డ్రైవర్ చౌహాన్ కూడా గాయపడ్డారు. వీరిద్దరినీ పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని పుష్ప పార్క్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జుహూలోని ఒక ఫుట్‌బాల్ మైదానం నుంచి హీరో టైగర్ ష్రాఫ్ బయటికి వెళుతున్న సమయంలో, మోటార్ సైకిల్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వ్యక్తులు ఈ కాల్పులకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను పట్టుకునేందుకు 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం ఆధారాలను సేకరించడంతో పాటు ఎన్ని రౌండ్లు కాల్పులు జరిగాయనే కోణంలో విచారణ జరుపుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్‌లను విశ్లేషిస్తున్నారు. 'టైగర్ ష్రాఫ్ సురక్షితంగా ఉన్నారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు' అని ఓ పోలీసు అధికారి తెలిపారు.
సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి..!
ఈ దాడి వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందని పేర్కొంటూ ఒక సోషల్ మీడియా పోస్ట్, వాయిస్ నోట్ వైరల్ అవుతున్నాయి. అయితే, దీనిని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ఆడియో ఫైల్లో అనిల్ పండిట్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హెచ్చరికలను లెక్కచేయకుండా, సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసేవారికి ఇదే గతి పడుతుందంటూ అందులో హెచ్చరించినట్లు సమాచారం. అయితే, ఈ లేఖ నిజమైనదా, దాడి వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందా అనే విషయాలను పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. మరోవైపు, ముంబై పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.
