హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దసరా పండుగ విశిష్టత, గిరిజన, గ్రామీణ, పట్టణ సంప్రదాయాలను వివరిస్తూ చరిత్ర పరిశోధకుడు డా.సత్యనారాయణ ద్యావనపల్లి రచించిన తెలంగాణ దసరా.. ట్రైబల్, రూరల్ అండ్ టౌన్ ట్రెడిషన్స్ అనే పుస్తకాన్ని సోమవారం ప్రముఖ సాహితీవేత్త జూలూరు గౌరీశంకర్ హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఆవిష్కరించారు. తెలంగాణ పండుగలు.. ఇక్కడి ప్రజల చారిత్రక, సాంస్కృతిక జీవన విధానాలకు అద్దం పడతాయని తెలిపారు. దసరాను గిరిజన సమాజాల నుంచి గ్రామీణ, పట్టణ ప్రజల వరకు ఎవరి పద్ధతుల్లో వారు విభిన్నంగా జరుపుకుంటారన్నారు.
ఈ సాంస్కృతిక వైవిధ్యాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. రచయిత సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణలో దసరా సంప్రదాయాలను క్షేత్రస్థాయి పరిశీలన, స్థానికుల జ్ఞాపకాలు, జానపద కథనాలు, చారిత్రక ఆధారాలతో ఈ గ్రంథంలో పొందుపరిచినట్లు వెల్లడించారు. జమ్మి చెట్టు పూజ, జమ్మి ఆకులను బంగారంగా ఇచ్చిపుచ్చుకోవడం, పంటలతో ముడిపడిన సంప్రదాయాలు, పెద్దపులి వేడుకల తీరును వివరించినట్లు తెలిపారు.
