- యూఎస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో వెల్లడి
న్యూఢిల్లీ: ఇండియాలో పొల్యూషన్ పీక్స్‌కు చేరింది. కాలుష్య కారక నగరాల జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచంలోని టాప్ 20 అత్యంత కాలుష్య నగరాల్లో భారత్ నుంచి ఏకంగా 13 సిటీలు చోటు సంపాదించుకున్నాయి. అయితే, నిత్యం తీవ్ర కాలుష్యంతో వార్తల్లో నిలిచే ఢిల్లీ మాత్రం ఈ లిస్టులో లేకపోవడం విశేషం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(యూఎస్ఏక్యూఐ) ప్రకారం.. భారతీయ నగరాల్లో బులంద్‌షహర్ (ఉత్తరప్రదేశ్) 3వ స్థానంలో నిలిచింది. ఇక్కడ యూఎస్ఏక్యూఐ198 (అన్‌హెల్తీ/ఆరోగ్యానికి హానికరం)గా నమోదైంది. అగర్తలా (త్రిపుర)181 ఏక్యూఐతో ఫోర్త్ ప్లేస్‌లో ఉంది. పాలి (రాజస్తాన్), ముజఫర్‌నగర్, మథురా (ఉత్తరప్రదేశ్), బుర్హాన్‌పూర్ (మధ్యప్రదేశ్): ఈ 4 నగరాల్లోనూ ఏక్యూఐ 174 చొప్పున నమోదైంది. రోహ్టక్ (హర్యానా) 172, కోటా (రాజస్తాన్) 170, ముంబై (మహారాష్ట్ర)167, హాపూర్ (యూపీ) 166, హిసార్ (హర్యానా)& బికనేర్ (రాజస్తాన్) రెండింటిలోనూ 165, బరేలీ (ఉత్తరప్రదేశ్)లో 164 ఏక్యూఐ నమోదైంది.
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు
ఇండోనేషియాలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంది. సెంట్రల్ కలిమంతన్ ప్రాంతానికి చెందిన పాలంగ్‌కరాయా యూఎస్ ఏక్యూఐ 242 (తీవ్రమైన కాలుష్యం)తో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పాలెంబ్యాంగ్ 207 ఏక్యూఐతో తీవ్ర కాలుష్య జాబితాలో సెకండ్ ప్లేసులో ఉంది. అలాగే సంపిత్ (180), జంబి (176) వరుసగా 5, 6 స్థానాల్లో నిలవగా, మలేషియాలోని పుత్రజాయ్, కౌలాలంపూర్, పెటాలింగ్ జయా నగరాలు కూడా టాప్-20లో చోటు దక్కించుకున్నాయి.
ఢిల్లీలో ఆందోళనకరంగానే గాలి నాణ్యత
ప్రపంచ టాప్-20 లిస్టులో ఢిల్లీ పేరు లేనప్పటికీ, ఇక్కడ కాలుష్యం ఆందోళనకరంగానే ఉంది. ఈనెల 19 ఉదయం 7:31 గంటలకు ఢిల్లీలో యూఎస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్గరిష్టంగా 191కి చేరుకుంది. అక్టోబర్ 18 సాయంత్రం 5:01 గంటలకు కనీస ఏక్యూఐ 126గా నమోదైంది. ఆ తర్వాత ఉదయం గరిష్ట స్థాయి నుంచి తగ్గుతూ మధ్యాహ్నానికి 130ల శ్రేణికి చేరుకుంది.
