కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు మరో రెండు రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించారు. అశుతోష్, సౌరవ్ లకు ఢిల్లీ పోలీసులు ఐదు రోజుల కస్టడీని కోరగా విచారణ చేపట్టిన స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ రెండు రోజుల కస్టడీకి అనుమతిచ్చారు. ఈ క్రమంలో ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్లపై కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఆసక్తికర పోస్ట్ చేశారు.
సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్లు ఎలా ఉద్యమంలోకి వచ్చారో ఈపోస్ట్ లో రాయడం చర్చనీయాంశంగా మారింది. కోట్లాది రూపాయలు వచ్చే లండన్ ఉద్యోగాన్ని వదిలి ఆశుతోష్ రంగా జెన్ జీ ఉద్యమంలోకి వచ్చారని రాశారు. మరో నేత సౌరవ్ కూడా రచయితగా న్యాయ వ్యవస్థపై రచనలు చేస్తూ మంచి జీవితాన్ని గడిపేవారని అలాంటి ఇద్దరు నేతలు ఉన్నత ఉద్యోగాలు, మంచి ఆర్థిక స్థితిని, సౌకర్యవంతమైన జీవితాలను వదులుకొని సమాజంలో మార్పు తీసుకురావాలని తమ జీవితాలను త్యాగం చేస్తున్నారని అభిజిత్ దీప్కే తన పోస్టులో రాశారు .
విలాసవంతమైన జీవితాలనువదిలి ప్రజా ఉద్యమాల్లోకి అడుగు పెట్టారని పొగిడారు. వీధుల్లో నిరసనలు, ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తే కఠినమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. చివరికి జైలు పాలయ్యారు. వారి వ్యక్తిగత జీవితాలను, భవిష్యత్తును పణంగా పెట్టాల్సిన అవసరం లేకపోయినా ఆ మార్గాన్ని ఎంచుకున్నారని అభినందించారు.
ఉన్నత కుటుంబాల నుంచి వచ్చినప్పటికీ, ఆర్థికంగా వెనుకబడినవారి హక్కుల కోసం పోరాడటం వారి ప్రత్యేకత. సొంత జీవితాలను ఆస్వాదించే అవకాశం ఉన్నా, వారు అలా చేయలేదు. తమకు తెలియని ప్రజల కష్టాలను తమ సమస్యలుగా భావించారని అన్నారు.
వారి త్యాగాలను ఎవరూ కోరలేదు. అయినా సమాజం మెరుగుపడాలనే ఆశతో ముందుకు సాగుతున్నారు. ఇతరుల జీవితాల్లో మార్పు కోసం తమ సుఖాలను వదులుకోవడం, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటం గొప్ప మానవీయ గుణమని వారి ప్రయాణం గుర్తుచేస్తోందన్నారు. ఆషు, సౌరవ్‌ల పోరాటం వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనకు ప్రతీకగా నిలుస్తోందన్నారు అభిజిత్ దీప్కే.
