హైదరాబాద్ సిటీలో ఘోస్ట్ కారు తిరుగుతుంది. ఘోస్ట్ కారు అంటే కారును దెయ్యం డ్రైవ్ చేస్తుందనుకుంటే పప్పులో కాలేసినట్టే. 20 ఏళ్ల కుర్రాడు హైదరాబాద్ సిటీలోని అత్తాపూర్‌లో ఘోస్ట్ కారు నడుపుతూ పోలీసులకు దొరికిపోయాడు. నంబర్ ప్లేట్‌కు కొంచెం పైన "GHOST" అని రాసి ఉన్న సుజుకి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు.
విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది వైపు నిర్లక్ష్యంగా కారు నడుపుతూ దూసుకురావడంతో అతనిని అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. టోలిచౌకిలోని సాలార్ జంగ్ కాలనీ నివాసి అయిన నిందితుడు మహమ్మద్ ఫహద్ ఉద్దీన్, తన నంబర్ ప్లేట్‌కు కొంచెం పైన "GHOST" అని రాయించుకున్నాడు.
వాహనాల నంబర్ ప్లేట్లపై అనధికారిక పేర్లు లేదా గుర్తులను ప్రదర్శించవద్దని పోలీసులు హెచ్చరించారు. ఉల్లంఘనలకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. అత్తాపూర్ సబ్-ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆయన టీం స్పందించి, డ్రైవర్‌ను పట్టుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అక్టోబర్ 16న నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతనికి జ్యుడిషియల్ కస్టడీ విధించింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలను అప్పగించే ముందు అత్యంత జాగ్రత్త వహించాలని, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల డ్రైవర్‌కే కాకుండా, రోడ్డుపై ఉన్న అమాయకులకు కూడా ప్రమాదం వాటిల్లుతుందని పోలీసులు గుర్తుచేశారు.
