ఇది నిజమా.. వెదురు ఇంధనం కింద పెట్రోల్, డీజిల్ కూడా పనికిరావా..? బైక్ నుంచి ఫ్లైట్ వరకు ఫ్యూచర్ ఇదేనా!

ఇది నిజమా.. వెదురు ఇంధనం కింద పెట్రోల్, డీజిల్ కూడా పనికిరావా..? బైక్ నుంచి ఫ్లైట్ వరకు ఫ్యూచర్ ఇదేనా!

పర్యావరణానికి హానికారక ఉద్గారాలను తగ్గించేందుకు నిరంతరం పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ20 ఇంధనం కొంత సేఫ్ అని భావిస్తున్నప్పటికీ దాన్ని తయారీ చేసే విధానం ఎంతో ఖర్చుతో, ఎక్కువ నీటి వినియోగంతో  కూడుకున్నది కావడం సవాలుగా మారింది. ఈ క్రమంలో వెదరుతో చేసే ఇంధనం భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులు తెస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. బైకు నుంచి ఫ్లైట్ వరకు భవిష్యత్తు ఇంధనంగా చెప్తున్న బ్యాంబూ ఫుయెల్ గురించి తెలుసుకుందాం.

 వోర్సెస్టర్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ (WPI) పరిశోధకులు చేసిన కొత్త రీసెర్చ్ ప్రకారం, బ్యాంబూ (వెదురు) ఆధారిత  ఇంధనం భవిష్యత్తులో వాహనాలు, విమానాలు, రైళ్లకు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇది ఫాసిల్ ఇంధనాలతో పోలిస్తే చాలా తక్కువ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను వెలువరిస్తుంది.

కెమికల్ ఇంజనీరింగ్ హెడ్ మైఖేల్ టిమ్కో నేతృత్వంలోని బృందం, హైడ్రోథర్మల్ లిక్విఫాక్షన్ (HTL) ప్రక్రియ ద్వారా బ్యాంబూను బయోక్రూడ్‌గా మార్చి, ఆర్థిక మోడలింగ్, లైఫ్-సైకిల్ అసెస్‌మెంట్ (LCA) చేసింది. ఈ అధ్యయనం Sustainable Energy & Fuels జర్నల్‌లో పబ్లిష్ అయ్యింది. 

ఆర్థిక అంచనాల ప్రకారం, కమర్షియల్ లెవెల్ లో ఈ ఇంధనం గ్యాసోలిన్-గ్యాలన్ సమానంగా కేవలం సుమారు 230 రూపాయలకు ఉత్పత్తి చేయవచ్చు. ఇది సాధారణ పెట్రోల్ ధరతో సమానం లేదా అంతకంటే తక్కువ కావచ్చు.

ఇది పర్యావరణపరంగా మరింత ఆకర్షణీయం అని చెబుతున్నారు. వెదురు ఇంధనం కార్బన్ ఫుట్‌ప్రింట్ సాధారణ పెట్రోల్ లేదా డీజిల్‌తో పోలిస్తే 26 రెట్లు తక్కువ. లైఫ్-సైకిల్ విశ్లేషణలో ఇది ప్రతి మెగాజూల్ శక్తికి కేవలం 3.5 గ్రాముల కార్బన్ డైయాక్సైడ్ వరకు విడుదల చేస్తుంది. సాధారణ ఫాసిల్ ఇంధనాలు 90-95 గ్రాములు విడుదల చేస్తాయి. బ్యాంబూ  భూగర్భ రైజోమ్‌లు   వాతావరణం నుంచి కార్బన్‌ను పీల్చి భూమిలో లాక్ చేస్తాయి.  

బ్యాంబూ వేగంగా పెరుగుతుంది. సారంలేని భూమిలోనూ పెరుగుతుంది.  పంట పూర్తయిన ప్రతీసారి  ప్రతి సంవత్సరం మళ్లీ నాటాల్సిన అవసరం లేదు. తక్కువ నిర్వహణతో, తక్కువ వ్యర్థాలతో  ఉత్పత్తి అవుతుంది. అమెరికా  ప్రస్తుత ఇథనాల్ ఉత్పత్తికి సమానమైన ఇంధనాన్ని కేవలం 13% వ్యవసాయ భూమితోనే తీయవచ్చని పరిశోధకులు అంచనా వేశారు. ఇండియా లాంటి దేశాల్లో ఆహార పంటలకు ఉపయోగించే భూమిని తీసుకోకుండా, పారిశ్రామిక వ్యర్థలు ఉండే స్థలాలు లేదా సారంలేని నిరుపయోగమైన నేలల్లోనూ పెంచవచ్చని చెబుతున్నారు.