- ప్రధాని మోదీని ప్రశ్నించిన కాంగ్రెస్ నేత జైరాం రమేశ్
న్యూఢిల్లీ: అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసుపై కాంగ్రెస్‌పై బీజేపీపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎందుకు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించింది. విరాళాల సొమ్మును దోచుకున్నవారికి శిక్ష పడేలా చూడాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. సోమవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రాముడి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ.. విరాళాల చోరీ పాపం వల్లే పతనమవుతుందని విమర్శించారు. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి అనుకూలంగా వ్యవహరించేలా ఏర్పాటు చేశారని ఆరోపించారు.
సిట్ దర్యాప్తుపై కాంగ్రెస్ అనుమానాలు
2026 జూన్ 4న రామాలయంలో విరాళాల సొమ్ము చోరీకి గురైన విషయం వెలుగులోకి వచ్చిందని జైరాం రమేశ్ తెలిపారు. ఆలయ ట్రస్టు అభ్యర్థన మేరకు 9 రోజుల తర్వాత, జూన్ 13న యూపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందన్నారు. ఆగస్టు 17న రాష్ట్ర హోంశాఖ రిపోర్టును ట్రస్టుకు సమర్పించిందని, అందులో ట్రస్టు మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, అనిల్ మిశ్రాకు క్లీన్‌చిట్ ఇచ్చారని ఆరోపించారు.
చోరీకి గురైన నగదు ఎంత? విలువైన వస్తువులు ఏ మేరకు మాయమయ్యాయి? అనే వివరాలను ఇప్పటివరకూ వెల్లడించలేదని విమర్శించారు. ఈ కేసులో విరాళాల సొమ్మును లెక్కించే ఎనిమిది మందిని అరెస్టు చేశారు, కానీ ట్రస్టులో పదవులు నిర్వహించినవారి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయలేదని కాంగ్రెస్ ఆరోపించింది.ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్రంగా విచారణ జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
