న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, అశుతోశ్ రాంకాల కస్టడీని కోర్టు మరో రెండు రోజులు పొడిగించింది. ఈమేరకు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారు తదుపరి విచారణ (అక్టోబర్ 21) వరకు జైల్లోనే ఉండనున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలను నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే, ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి రాంకా, దాస్ జంతర్ మంతర్ వద్ద జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు వారిపై ట్రెస్ పాసింగ్ కేసు పెట్టి అరెస్టు చేశారు. వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా.. జడ్జి వారికి 5 రోజుల కస్టడీ విధించారు. ఈ క్రమంలోనే రాంకా, దాస్ లను మరో రెండు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి.. కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాగా, రాంకా, దాస్ ల కస్టడీ పొడిగింపుపై సీజేపీ లీగల్ అఫైర్స్ హెడ్ రత్నా సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది చట్టం దుర్వినియోగమని ఆమె అభివర్ణించారు. తాము తాజాగా సమర్పించిన పూచీకత్తులను చిన్నపాటి సాంకేతిక కారణాలు చూపి తిరస్కరించారని, వారిని అడ్డుకోవడానికి మొత్తం వ్యవస్థ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.
