హైదరాబాద్, వెలుగు: దాంపత్య జీవితంలో చిన్నపాటి గొడవలు, అభిప్రాయ భేదాలను మానసిక క్రూరత్వంగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కారణాలతో విడాకులు మంజూరు చేయలేమని పేర్కొంది. హైదరాబాద్కు చెందిన దంపతులకు 2009లో వివాహం కాగా, 2010లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత విభేదాలు మొదలయ్యాయని, భార్య వేధింపులకు పాల్పడుతోందని భర్త విడాకుల కోసం కింది కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయన పిటిషన్ను కొట్టివేసిన కింది కోర్టు.. దాంపత్య హక్కుల పునరుద్ధరణకు భార్య దాఖలు చేసిన పిటిషన్ను అనుమతించింది.
ఈ తీర్పులను సవాలు చేస్తూ భర్త హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ కె. సుజనలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. భార్య మానసిక సమస్యతో బాధపడుతోందన్న ఆరోపణకు భర్త ఆధారాలు చూపలేదని పేర్కొంది. భార్య, అత్తమామలు ఇల్లరికం రావాలని పట్టుబట్టారన్న ఆరోపణకూ తగిన ఆధారాలు లేవంది. భార్య నగలతో సహా వెళ్లిపోయిందన్న ఆరోపణను కూడా పరిగణనలోకి తీసుకోలేమని తెలిపింది. గృహహింస కేసు దాఖలు చేయడాన్ని మాత్రమే భర్తపై క్రూరత్వంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. దంపతులు 14 ఏళ్లుగా విడిగా ఉంటున్నప్పటికీ, విడాకులు మంజూరు చేయడానికి తగిన కారణాలు లేవని పేర్కొంది. స్వల్ప వివాదాలతో విడాకులు కోరడం సమంజసం కాదని అభిప్రాయపడుతూ, కింది కోర్టు తీర్పును సమర్థించింది. భర్త దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది.
