- అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
- స్కిల్స్ వర్సిటీ పనుల్లో వేగం పెంచండి
- వచ్చే నెలాఖరులోగా పూర్తి కావాలి
- ఇబ్రహీంపట్నంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రారంభం
- ఎఫ్‌సీడీఏ ఆవరణలో ఎన్‌ఐయూఎం క్యాంపస్‌కు శంకుస్థాపన చేసిన సీఎం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్ 2026’కు ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ సదస్సు కేవలం సాధారణ వ్యాపార సమావేశం మాత్రమే కాదని, తెలంగాణ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే చారిత్రక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు అధికారులతో తక్షణమే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా పరిధిలోని భారత్ ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. సదస్సుకు వేదిక కానున్న ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్సిటీ పనుల్లో వేగం పెంచి, నిర్దేశిత గడువు కంటే 15 రోజుల ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఇందుకోసం అవసరమైతే అదనపు సిబ్బందిని, కూలీలను వాడుకోవాలని సూచించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు ‘మీ పెట్టుబడులకు మాది భరోసా’ అనే నినాదంతో నిర్వహించనున్న గ్లోబల్ సమిట్ సదస్సు సన్నాహాలను నవంబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించారు. ప్రత్యేకించి బహిరంగ ప్రాంగణ పనులను నవంబరు 15 నాటికే సిద్ధం చేయాలన్నారు.
రోల్ మోడల్‌గా ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్
ఇబ్రహీంపట్నంలో కొత్తగా నిర్మించిన ‘ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్’ భవనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. కమిషనరేట్ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ) కార్యాలయ చాంబర్‌ను ప్రారంభించిన అనంతరం తొలి సీపీ తరుణ్ జోషికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ సరికొత్త సాంకేతిక ప్రమాణాలతో రోల్ మోడల్‌గా నిలవాలని ఆకాంక్షించారు.
అనంతరం ఫ్యూచర్ సిటీకి చేరుకున్న సీఎం.. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కార్యాలయ ఆవరణలో ప్రతిష్టాత్మక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐయూఎం ) నూతన క్యాంపస్ నిర్మాణ పనులకు భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన ఎన్‌ఐయూఎం క్యాంపస్ నమూనా, మాస్టర్ ప్లాన్ డిజైన్లను పరిశీలించి.. ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు.
అత్యున్నత ప్రమాణాలతో వసతులుండాలి
గ్లోబల్ సమిట్ ద్వారా దేశ, విదేశాలకు చెందిన అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ దిగ్గజ సంస్థల ప్రతినిధులను ఆకర్షించేలా అన్ని వసతులూ అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని అధికార యంత్రాంగానికి సీఎం దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని చాటిచెప్పేలా ఫ్యూచర్ సిటీలో ప్రపంచస్థాయి రోడ్లు, రవాణా, భద్రతా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు.
గ్లోబల్ సమిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలపాలని అధికారులకు పిలుపునిచ్చారు. సీఎం పర్యటనలో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, ప్రకాశ్ గౌడ్, కాలె యాదయ్య పాల్గొన్నారు.
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు కొత్త ఆఫీసు
హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌కు శాశ్వత భవనం అందుబాటులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఆక్టోపస్ క్యాంపస్‌లో నిర్మించిన కొత్త కమిషనరేట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. డీజీపీ సీవీ ఆనంద్‌తో కలిసి సీపీ చాంబర్‌తో పాటు పలు ఆఫీసులను ఓపెన్చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, పలువురు పోలీస్ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి.. తరుణ్ జోషిని సీపీ కుర్చీలో కూర్చోబెట్టి, పూల బొకే అందించి అభినందించారు. కమిషనరేట్ రిజిస్టర్‌లో తొలి సంతకం చేశారు. కమిషనరేట్‌లో చేసిన మార్పులు, కల్పించిన సౌకర్యాల గురించి డీజీపీ సీవీ ఆనంద్‌ను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు సులభంగా సేవలు అందేలా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌ను తొలుత తాత్కాలికంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు తరలించారు. తాజాగా ఆక్టోపస్ క్యాంపస్‌లో శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు.
