- అల్గారిథమ్ మార్చుకోవాలని సూచన
- ఫేస్బుక్, ఇన్‌స్టా కంటెంట్ సిఫార్సులపై సమీక్షకు ఆదేశం
న్యూఢిల్లీ: మెటా సంస్థకు కేంద్రం మరోసారి స్ట్రాంగ్వార్నింగ్ఇచ్చింది. ఫేస్బుక్, ఇన్‌స్టా అనుసరిస్తున్న కంటెంట్ రికమండేషన్(సిఫార్సు) విధానాలను సమీక్షించాలని ఆదేశించింది. తప్పుడు లేదా పాత కంటెంట్ పోస్టులను ప్రచారం చేయడం, యూజర్లకు పరిమితమైన లేదా ఒకే రకమైన కథనాల్ని మాత్రమే పదేపదే చూపించడం వంటి అల్గారిథమ్ పద్ధతులను మార్చుకోవాలని స్పష్టం చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కంటెంట్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది. ఈమేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఈ నెల 10న మెటాకు మార్గదర్శకాలు జారీ చేసింది.
ముఖ్యమైన రాజకీయ పరిణామాలు, ప్రజా శాంతిభద్రతల సమస్యలు వార్తల్లో ఉన్నప్పుడు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు యూజర్లకు ఎలాంటి కంటెంట్‌ను సిఫార్సు చేస్తున్నాయో పరిశీలించాలని సూచించింది. ఫేక్ పోస్టులు, మార్ఫింగ్ చేసిన విజువల్స్ లేదా ఒకేరకమైన కథనాలకు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రాధాన్యం దక్కకుండా చూసుకోవాలని హెచ్చరించింది.
పాత వీడియోలను ప్రస్తుత ఘటనలుగా చూపడం, డేటా లేని లొకేషన్ల వల్ల తప్పుడు సమాచారం వేగంగా విస్తరించడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఫొటోలు, వీడియోలు, గ్రాఫిక్స్ వంటి సమాచారాన్ని చూపేటప్పుడు వాటి నేపథ్యం కూడా వివరించాలని పేర్కొంది. ఒక వీడియో లేదా ఫొటో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో లేదా దాని వెనుక ఉన్న పరిస్థితులేంటనేది స్పష్టంగా తెలియని సందర్భాల్లో పూర్తి వివరాలు అందించాలని సూచించింది.
సీజేపీ నిరసనల ప్రభావమేనా..
సిఫార్సు వ్యవస్థల ద్వారా వైరల్ అవుతున్న పోస్టులను గుర్తించి సమీక్షించే విధానాలను మెటా మెరుగుపరచుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖ కోరింది. ప్రజాశాంతికి విఘాతం కలిగించే అంశాలపై సకాలంలో స్పందించి, తీసుకున్న చర్యల వివరాలను ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించింది. హానికరమైన కంటెంట్‌పై చర్యలు తీసుకునేటప్పుడు, చట్టబద్ధమైన ప్రజా చర్చలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని కోరింది.
2000 ఐటీ యాక్ట్, ఐటీ 2021 నిబంధనల్ని మెటా తప్పకుండా పాటించాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే.. ఈ ఆదేశాల వెనుక నిర్దిష్టమైన సంఘటన పేరును ప్రభుత్వం ప్రస్తావించనప్పటికీ, సీఈసీ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో ఢిల్లీలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
