- వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి
- ఆందోళనకారులపై లాఠీచార్జ్
ఇంఫాల్: మణిపూర్‌లో శాంతిభద్రతలు మరోసారి క్షీణించాయి. తాజాగా చోటుచేసుకున్న వేర్వేరు హింసాత్మక ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలతో ఇంఫాల్ నగరం అట్టుడికిపోయింది. మృతదేహాలతో నిరసనకారులు సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. మైతీ, పాంగల్ ముస్లింలు నివసించే ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన ఒక మ్యూజికల్ ఈవెంట్లో ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది.
ఇరువర్గాల మధ్య జరిగిన రాళ్లదాడి, కాల్పుల్లో పలువురు గాయపడగా, చికిత్స పొందుతూ 24 ఏండ్ల యువకుడు మృతి చెందాడు. మరోవైపు, ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖమెన్‌లాక్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక కొండ ప్రాంతానికి కట్టెలు ఏరుకోవడానికి వెళ్లిన ముగ్గురు గ్రామస్తులను సాయుధులు కాల్చి చంపారు. ఈ దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాద సంస్థల ప్రాబల్యం ఉందని పోలీసులు తెలిపారు.
సీఎం నివాసం ముట్టడి..
ఈ దారుణ హత్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్రామస్తులు మృతదేహాలను తీసుకుని ఇంఫాల్‌లోని సీఎం బంగ్లా వద్దకు చేరుకున్నారు. సీఎం ఇంటి ముందు మృతదేహాలను ఉంచి నిరసన తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడానికి బాష్పవాయువు ప్రయోగించి, లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే తొక్చోమ్ లోకేశ్వర్ సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంఫాల్ తూర్పు-కాంగ్ పోక్సి సరిహద్దులో భద్రత కల్పిస్తామని అస్సాం రైఫిల్స్ సిబ్బంది హామీ ఇచ్చినప్పటికీ ఈ దాడి జరిగిందని తెలిపారు. ఆ ప్రాంతానికి సమీపంలోని ‘సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్’ (సో) శిబిరాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా, రాజ్ మెడిసిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం యుమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్ పరామర్శించి, ధైర్యం చెప్పారు.
