చినుకు రాలే వేళ.. అడవిలో షికారు!.. మన్ననూర్ జంగిల్ రిసార్ట్

చినుకు రాలే వేళ.. అడవిలో షికారు!.. మన్ననూర్ జంగిల్ రిసార్ట్

వర్షపు చినుకులు నేలను తాకుతుంటే.. అడవంతా పచ్చని రంగు పులుముకుంటుంది. ఎత్తైన చెట్ల మధ్య నుంచి జాలువారే జలధారలు, గలగల పారే సెలయేర్లు, కొండలు, లోయల అందాలు, పక్షుల కిలకిలరావాలు, అడవిలో స్వేచ్ఛగా సంచరించే వన్యప్రాణులు.. ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. నగర జీవితంలోని ఉరుకులు, పరుగులకు కాసేపు దూరంగా ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వారికి తెలంగాణ అడవులు మాన్​సూన్‌లో సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. 

ఎటు చూసినా పచ్చని చెట్లు.. ఎత్తైన కొండలు.. గుట్టలు.. నీటి గలగలలతో ప్రవహిస్తున్న సెలయేర్లు.. సరస్సులు, వాగులు, వంకలు.. చెంగుచెంగున దూకుతూ పరుగులు తీస్తున్న జింకలు.. పులుల గర్జనలు.. వివిధ రకాల వన్యప్రాణులు.. ప్రకృతి రమణీయతకు, ఆహ్లాదానికి నిలయాలుగా ఉన్న తెలంగాణలోని వన్యప్రాణుల అభయారణ్యాలు  పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యంలోని ది జెయింట్ స్క్విరెల్ ఎకోపార్కు, నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌, నల్లమల అడవిలో ఉన్న మన్ననూర్ జంగిల్ రిసార్ట్, వికారాబాద్ జిల్లాలో ఎత్తైన కొండల మధ్య ఉన్న అనంతగిరిహిల్స్ అడవులు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. 

నాగర్ కర్నూల్ జిల్లాలోని దట్టమైన నల్లమల అడవిలో ఉన్న మన్ననూర్ జంగిల్ రిసార్ట్​ను అటవీ సౌందర్యాన్ని ఆధునిక ఆతిథ్యంతో మేళవించి, ఆలోచనాత్మకంగా రూపొందించారు. ఫారెస్ట్ సఫారీల్లో పులుల ఆవాస ప్రాంతంలోకి వెళ్లి చితాల్, సాంబార్, నీల్గాయ్, అడవి పంది, ధోల్స్, చిరుతపులులు, పులులను చూడొచ్చు. సూర్యోదయంలో పక్షుల కిలకిలరావాలు మధ్య ట్రెక్కింగ్‌‌ చేస్తూ లోయలు, అడవుల్లో పులులు, భారతీయ పంగోలిన్‌‌లు, అడవి కుక్కలు, అనేక పక్షి జాతులను చూడొచ్చు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌‌లో జరిగే అటవీ టైగర్ సఫారీ, ట్రెక్కింగ్ చేయొచ్చు. మన్ననూర్ జంగిల్ రిసార్ట్‌‌లో ప్రకృతి మధ్య అడవి వాతావరణంలో చెంచు సంప్రదాయ మట్టి గుడిసెలు, ట్రీ హౌస్, రస్టిక్ మట్టి ఇల్లు, ఎరోకాన్ కాటేజీల్లో బస చేయొచ్చు. రాత్రిపూట అరణ్య విహారం తమకు మరిచిపోలేని అనుభూతిని అందించిందని టూరిస్ట్​ జి. రాజేశ్వరి చెప్పారు.

అమ్రాబాద్ అందాలు

ఫరహాబాద్ వ్యూ పాయింట్, నల్లమల కొండలు, లోయలు, అడవి అందాలను ఒకేసారి చూడగల అద్భుతమైన ప్రదేశం. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌‌లో అధికారికంగా నిర్వహించే జంగిల్ సఫారీ అనుభవం ఇక్కడి ప్రత్యేకత. మన్ననూర్ నుంచి 42 కి.మీ. దూరంలో ఆక్టోపస్ వ్యూ పాయింట్ నుంచి శ్రీశైలం డ్యామ్ బ్యాక్‌‌ వాటర్, నల్లమల కొండల దృశ్యాలు తిలకించొచ్చు. నల్లమల అడవిలో మన్ననూర్ నుంచి 30 కి.మీ. దూరంలో ఉన్న మల్లెలతీర్థం జలపాతం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. మన్ననూర్ నుంచి 36 కి.మీ. దూరంలో ఉన్న ప్రసిద్ధ గుహలు అక్కమహాదేవి గుహలు, మన్ననూర్ సరస్సు పర్యాటకులకు మంచి అనుభూతినిస్తాయి. మన్ననూర్ నుంచి 57 కి.మీ. దూరంలో ఉన్న శ్రీశైలం డ్యామ్ వ్యూపాయింట్ దగ్గర నుంచి కృష్ణా నదీ ప్రవాహం, డ్యామ్, నల్లమల కొండల దృశ్యాలను చూడొచ్చు. రెండు రోజుల మన్ననూర్ రిసార్ట్ యాత్రలో అడవి అందాలను తిలకించొచ్చు.

జంగిల్ రిస్టార్​కు ఎలా వెళ్లాలి?

హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారి 765 పై ఉన్న మన్ననూర్ జంగిల్ రిసార్ట్​ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్​లో ఉంది. హైదరాబాద్ నుంచి మన్ననూర్‌‌ 155 కి.మీ. దూరం ప్రయాణించడానికి 3 గంటలు పడుతుంది. హైదరాబాద్ నుంచి షాద్‌‌నగర్, కల్వకుర్తి, అచ్చంపేట మీదుగా మన్ననూర్ జంగిల్ రిసార్ట్​కు చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళ్లే బస్సులో మన్ననూర్ దగ్గర దిగొచ్చు. అక్కడి నుంచి రిసార్ట్‌‌కు స్థానిక ఆటో, క్యాబ్​లలో వెళ్లొచ్చు. 

ది బ్రీజ్ @ అనంతగిరి హిల్స్

 
ప్రకృతి ఒడిలో అలరారుతున్న అనంతగిరి కొండల మధ్య ఉన్న అడవిలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ది బ్రీజ్ పేరిట మరపురాని అరణ్య అనుభవానికి ఆహ్వానిస్తోంది. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ యాత్రలో ఉదయపు పక్షుల వీక్షణ నడక, ప్రకృతి యాత్ర అనుభూతిని పర్యాటకులకు అందిస్తోంది. అనంతగిరి కొండలు వారాంతపు విహారానికి ప్రశాంతమైన విడిది. వికారాబాద్ సమీపంలో ఉన్న ఈ హిల్ స్టేషన్ పచ్చదనం, దట్టమైన అడవులకు నిలయం. ట్రెక్కింగ్, బర్డ్ వాక్స్, నైట్ క్యాంప్స్, జంగల్ కాటేజెస్​లో బస, సఫారీ, అడవిలో బుష్ బ్రేక్ ఫాస్ట్ వంటి వినూత్న కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయని వరంగల్​కు చెందిన జి. ప్రవీణ్ రెడ్డి చెప్పారు. చుట్టుపక్కల అనంతగిరి కొండల అడవి, అనంతగిరి హిల్స్ వ్యూపాయింట్ వంటి ప్రదేశాలు చూడదగినవి. ఇంకా శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం, మూసీ నదీ జన్మస్థలం అనంతగిరి కొండలు, కోటపల్లి రిజర్వాయర్, బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం, గ్రాస్‌‌ల్యాండ్స్ వ్యూపాయింట్ వంటివి ఉన్నాయి.

ఎలా వెళ్లాలంటే..

హైదరాబాద్ నుంచి కారులో చేవెళ్ల, వికారాబాద్, అనంతగిరి హిల్స్ వైపు వెళ్లొచ్చు. అనంతగిరి ప్రాంతం హైదరాబాద్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలులో హైదరాబాద్ నుంచి వికారాబాద్ రైల్వే స్టేషన్ వరకు వచ్చి, అక్కడి నుంచి క్యాబ్, ఆటో ద్వారా వెళ్లొచ్చు. 

తాడ్వాయి ది జెయింట్ స్క్విరెల్ రిసార్ట్

  చుట్టూ దట్టమైన అడవులు.. గడ్డిమైదానాలు.. చెట్లపై వాలుతున్న రంగు రంగుల సీతాకోక చిలుకలు, నెమళ్లు, గౌర్, సాంబార్, చిత్తల్, అడవి పంది, కృష్ణజింకలు, నాలుగు కొమ్ముల జింక, ఎలుగుబంట్లు వంటి జంతువులతో తాడ్వాయి రిసార్ట్ కనువిందు చేస్తోంది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అంచున వెలసిన తాడ్వాయి ది జెయింట్ స్క్విరెల్ రిసార్ట్ పర్యాటకులకు సరికొత్త పర్యావరణ, విలాసవంతమైన విడిదిగా నిలిచింది. శతాబ్దాల నాటి టేకు చెట్ల పందిరి, వాలుగా ఉన్న కొండలు, జీవనాధారమైన దయ్యం వాగు సెలయేరుతో కూడిన ప్రకృతి ఒడిలో గ్రామీణ సుందరమైన కాటేజీల్లో బస చేసిన పర్యాటకులు మధుర అనుభూతులను పొందుతున్నారు.

పచ్చదనంతో కళకళ

నిత్యం నీటితో కళకళలాడుతున్న గోదావరి నదీ తీరం.. మామిడికుంట గడ్డి మైదానాలు, జలాశయాలకు వాక్‌‌లు, చారిత్రాత్మక జలగలంచ కోటకు ట్రెక్కింగ్‌‌ చేయడం, సూర్యాస్తమయ వేళలో జలగలంచ శిఖరాగ్రంపై సేదతీరడం, అడవి, కొండలపై సూర్యాస్తమయాన్ని చూడొచ్చు. తాడ్వాయి అడవిలో విహరిస్తూ ప్రకృతి అందాలను వీక్షించడం మరచిపోలేని అనుభూతిని అందించిందని మధిర పర్యాటకుడు టి. ఆదినారాయణ చెప్పారు. 

ప్రకృతిని ఆస్వాదిస్తూ అడవిలో ఉదయం నడకలో తమకు జింకలు, రంగురంగుల పక్షులు కనిపించాయని ఆయన పేర్కొన్నారు. నగర రణగొణ ధ్వనులకు దూరంగా, కాలుష్యం లేని పచ్చని అడవిలో ప్రకృతి ఒడిలో విహరిస్తూ వన్యప్రాణులు, అడవిలో వాకింగ్ చేయాలనుకునే వారికి తాడ్వాయి ది జెయింట్ స్క్విరెల్ రిసార్ట్ బెస్ట్ చాయిస్. ఇక్కడ చుట్టుపక్కల ఏటూరునాగారం వన్యప్రాణి అభయారణ్యం, లక్నవరం సరస్సు, సస్పెన్షన్ బ్రిడ్జ్, బోటింగ్ షికారు, బొగత జలపాతం, దామరవాయి డోల్మెన్స్ పురాతన చారిత్రక అవశేషాలు, మేడారం సమ్మక్క సారలమ్మ పుణ్యక్షేత్రం చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు. 

ఎలా వెళ్లాలంటే..

తాడ్వాయి ది జెయింట్ స్క్విరెల్ రిసార్టు, ఏటూరునాగారం వన్యప్రాణి అభయారణ్యాలు హైదరాబాద్ నుంచి 240 కి.మీ దూరం దాదాపు 5 గంటలపాటు కారులో ప్రయాణించడం ద్వారా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి జాతీయ రహదారి163 మీదుగా భువనగిరి, వరంగల్, ములుగు, వెంకటాపూర్, తాడ్వాయికు చేరుకోవచ్చు. రైలులో ప్రయాణం అయితే వరంగల్/ కాజీపేట వరకు రైలులో వచ్చి, అక్కడి నుంచి క్యాబ్ లేదా బస్సులో తాడ్వాయి వెళ్లొచ్చు. వరంగల్ నుంచి తాడ్వాయి 90 కి.మీ దూరంలో ఉంది.

టూరిజంలో కొత్త మైలురాళ్లు.. 

ఈ యాత్రలు తెలంగాణలో సంప్రదాయ పర్యాటకానికి భిన్నంగా తక్కువ సంఖ్యలో పర్యాటకులను అనుమతిస్తూ, ఉన్నత ప్రమాణాలతో ఎకో - లగ్జరీ అనుభూతిని అందిస్తున్నాం. తాడ్వాయి, అమ్రాబాద్, అనంతగిరి అటవీ ప్రాంతాల్లో కల్పించిన వసతులు, సఫారీ సేవలు పర్యాటక రంగంలో కొత్త మైలురాళ్లుగా నిలిచాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌‌ను మరింత విస్తరించి జాతీయ స్థాయిలో అగ్రగామి ఎకో - టూరిజం బ్రాండ్‌‌గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. 

- ఎల్. రంజిత్ నాయక్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలంగాణ ఎకో టూరిజం

గిరిజనులకు ఉపాధి.. టూరిస్ట్​లకు మరపురాని అనుభూతి..

తాడ్వాయి, అమ్రాబాద్‌‌లోని గిరిజనులు, అనంతగిరి ప్రాంతాల్లోని యువతకు ఆతిథ్యం, గైడింగ్, నిర్వహణ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తున్నాం. పర్యాటకులకు ఉదయాన్నే సాగే నేచర్ వాక్, గడ్డిభూముల్లో అందించే బుష్ బ్రేక్‌‌ఫాస్ట్, అటవీ బస ఏర్పాట్లు చేస్తోంది మా బృందం. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే వచ్చే ప్రతి టూరిస్ట్​కి విజ్ఞానాన్ని, మానసిక ప్రశాంతతను అందించేలా ఈ ఎకో - టూరిజం వింగ్‌‌ను మరింత క్రియేటివ్​గా అభివృద్ధి చేస్తున్నాం.

- కె.శిరీష, అసిస్టెంట్ డైరెక్టర్

పర్యాటకుల ప్రశంసలు...

తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ప్రారంభించిన దక్కన్ వుడ్స్ అండ్ ట్రయల్స్ ఎకో - టూరిజం ప్రాజెక్టులకు పర్యాటకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాడ్వాయిలోని ది జెయింట్ స్క్విరెల్ రిసార్ట్ హట్స్, అమ్రాబాద్‌‌లోని మన్ననూర్ జంగిల్ రిసార్ట్, వికారాబాద్‌‌లోని ది బ్రీజ్ అనంతగిరి హిల్స్ ఆకట్టుకుంటున్నాయి. నేచురలిస్టుల పర్యవేక్షణలో సాగే అడవి సఫారీ యాత్ర, ఉదయాన్నే సాగే బర్డ్ వాక్స్, అనంతగిరి గడ్డిభూముల్లో అందించే బుష్ బ్రేక్‌‌ఫాస్ట్, ట్రెక్కింగ్ కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

- కళ్యాణపు సుమన్,ఎకో - టూరిజం ప్రాజెక్ట్స్ మేనేజర్