నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జీజీహెచ్‌లో శనివారం రెండున్నరేండ్ల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. తల్లిని చూడడానికి హాస్పిటల్‌కు వచ్చిన బాలుడికి చాక్లెట్ ఆశ చూపించి గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
బాల్కొండ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన కొసడి నరేశ్, సంధ్య దంపతులకు నివాన్ష్(5), దేవాన్ష్(రెండున్నరేండ్లు) ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యను మూడో కాన్పు కోసం బుధవారం జీజీహెచ్‌లోని మాతాశిశు సెంటర్లో చేర్పించగా, ఆడపిల్ల పుట్టింది. శనివారం నరేశ్ తన ఇద్దరు కొడుకులతో కలిసి హాస్పిటల్‌కు వచ్చాడు.
అంతా కలిసి మధ్యాహ్నం భోజనం చేశాక చేతులు కడుక్కోడానికి ట్యాప్ దగ్గరకు వచ్చినప్పుడు గుర్తు తెలియని 40 ఏండ్ల మహిళ వారితో మాటలు కలిపింది. చాక్లెట్ ఇస్తానని చెప్పడంతో ఇద్దరు పిల్లలు అమాయకంగా ఆమె వెంట హాస్పిటల్ వరండా దాకా వెళ్లారు.
అక్కడి నుంచి దేవాన్ష్‌ను మహిళ ఆటోలో ఎత్తుకెళ్లింది. పెద్ద కొడుడు నివాన్ష్ పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి, నానమ్మకు ఈ విషయం చెప్పాడు. తండ్రి హాస్పిటల్, బస్టాండ్ పరిసరాల్లో వెతికినా కనిపించకపోవడంతో వన్‌టౌన్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. సీసీ పుటేజీ ఆధారంగా నాలుగు పోలీస్ టీంలు బాలుడి కోసం వెతుకుతున్నాయి.
