కాంగ్రెస్ లో కీలక మార్పులు..ఆరు రాష్ట్రాలకు ఇన్‌‌చార్జీలు : కేసీ వేణుగోపాల్‌‌ 

కాంగ్రెస్ లో కీలక మార్పులు..ఆరు రాష్ట్రాలకు ఇన్‌‌చార్జీలు : కేసీ వేణుగోపాల్‌‌ 
  • ఏపీ కొత్త ఇన్‌‌చార్జీగా పీవీ మోహన్ కు బాధ్యతలు
  • తక్షణమే అమల్లోకి రానున్న నియామకాలు

న్యూ ఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్‌‌ పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక మార్పులు చేసింది. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఇన్ చార్జీలను నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌‌ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌‌ కాంగ్రెస్‌‌ పార్టీ వ్యవహారాల ఇన్‌‌చార్జీగా పీవీ మోహన్‌‌ను నియమించారు. ఇప్పటివరకు ఏపీ వ్యవహారాలను పర్యవేక్షించిన ఎంపీ మాణిక్యం ఠాకూర్ స్థానంలో  మోహన్‌‌ కు బాధ్యతలు అప్పగించింది.

అలాగే , అస్సాం ఏఐసీసీ ఇన్ చార్జీగా చత్తీస్‌‌గఢ్ మాజీ సీఎం భూపేశ్‌‌ బఘేల్‌‌, గుజరాత్‌‌ ఇన్ చార్జీగా రణదీప్‌‌ సింగ్‌‌ సూర్జేవాలా, పంజాబ్‌‌ ఇన్ చార్జీగా సచిన్‌‌ పైలట్‌‌ను నియమించారు. చత్తీస్‌‌గఢ్‌‌ ఇన్ చార్జీగా సుఖ్‌‌దేవ్‌‌ భగత్‌‌, మహారాష్ట్ర ఇన్ చార్జీగా డాక్టర్‌‌ సిరివెళ్ల ప్రసాద్‌‌ను నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. రణదీప్‌‌ సింగ్‌‌ సూర్జేవాలాకు గుజరాత్‌‌తో పాటు కర్నాటక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఇన్ చార్జీగా బాధ్యతలను అదనంగా అప్పగించారు.

ఇదిలా ఉండగా, ఇప్పటివరకు ఆయా రాష్ట్రాల వ్యవహారాలను పర్యవేక్షించిన జితేంద్ర సింగ్‌‌, రమేశ్‌‌ చెన్నితల, మాణిక్కం ఠాగూర్‌‌ల సేవలను కాంగ్రెస్‌‌ పార్టీ అభినందించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ముకుల్‌‌ వాస్నిక్‌‌ కొనసాగనున్నారు. తాజా నియామకాలతో ఆయా రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలను మరింత సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్‌‌ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.