న్యూఢిల్లీ: భారతదేశంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా జరుగుతున్న చారిత్రక పోరాటానికి ప్రపంచ వేదికపై గుర్తింపు లభించింది. నవంబర్ 27ను ‘అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవం’గా ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. ఎన్డీటీవీ, ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్’ సంస్థ సంయుక్తంగా 2023 నుంచి నిర్వహిస్తున్న ‘చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా’ ప్రచారానికి ఈ నిర్ణయం ద్వారా ఘనమైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకుడు భువన్ రిభు చేసిన ప్రతిపాదన ఆధారంగా సియెర్రా లియోన్ దేశం ఐక్యరాజ్యసమితిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిని సెప్టెంబర్ 4న యూఎన్ ఆమోదించింది. 2024 నవంబర్ 27న భారత ప్రభుత్వం 'బాల్ వివాహ్ ముక్త్ భారత్' ప్రచారాన్ని ప్రారంభించిన తేదీ కావడంతో ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నాడు దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా ప్రజలు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయడం విశేషం.
