ప్రపంచపటంలో మరింత పెద్దగా ఆఫ్రికా..తగ్గనున్న యూరప్‌‌‌‌, అమెరికా సైజ్‌‌‌‌.. UNO తీర్మానాన్ని వ్యతిరేకించిన ట్రంప్

ప్రపంచపటంలో మరింత పెద్దగా ఆఫ్రికా..తగ్గనున్న యూరప్‌‌‌‌, అమెరికా సైజ్‌‌‌‌.. UNO తీర్మానాన్ని వ్యతిరేకించిన ట్రంప్
  • కొత్త మ్యాప్‌‌‌‌ రూపొందించాలన్న తీర్మానానికి యూఎన్‌‌‌‌ ఆమోదం 
  • తీర్మానాన్ని వ్యతిరేకించిన అమెరికా

న్యూయార్క్‌‌‌‌: ప్రపంచ పటంలో ఆఫ్రికా ఖండం ఇక మరింత పెద్దగా కనిపించనుంది. ఇప్పటివరకు వాడుతున్న మ్యాప్‌‌‌‌లో చిన్నగా కనిపించిన ఆఫ్రికా.. కొత్త ప్రపంచ పటంలో తన అసలు విస్తీర్ణానికి దగ్గరగా కనిపించనుంది. అదే సమయంలో యూరప్‌‌‌‌, ఉత్తర అమెరికా పరిమాణం తగ్గనుంది. ఈ మేరకు ఖండాల అసలు విస్తీర్ణాలను మరింత కచ్చితంగా చూపించే కొత్త ‘ఈక్వల్‌‌‌‌ ఎర్త్‌‌‌‌’ మ్యాప్‌‌‌‌ను ప్రోత్సహించాలన్న తీర్మానానికి యునైటెడ్‌‌‌‌ నేషన్స్‌‌‌‌ జనరల్‌‌‌‌ అసెంబ్లీ శనివారం ఆమోదం తెలిపింది. టోగో నేతృత్వంలో తెచ్చిన ఈ తీర్మానానికి 164 దేశాలు అనుకూలంగా ఓటేయగా.. అమెరికా మాత్రం వ్యతిరేకించింది. మరో ఆరు దేశాలు ఓటింగ్‌‌‌‌కు దూరంగా ఉన్నాయి. కొత్త ప్రపంచ మ్యాప్‌‌‌‌ను ‘ఈక్వల్‌‌‌‌ ఎర్త్‌‌‌‌ కార్టోగ్రాఫిక్‌‌‌‌ ప్రొజెక్షన్‌‌‌‌’గా పిలుస్తున్నారు. 

కొత్త మ్యాప్‌‌‌‌ ఎందుకంటే..

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న మెర్కేటర్‌‌‌‌ ప్రొజెక్షన్‌‌‌‌ను 1569లో సముద్ర ప్రయాణాల కోసం రూపొందించారు. భూగోళాన్ని చదునైన పటంగా మార్చే క్రమంలో ధ్రువ ప్రాంతాల వైపు ఉన్న భూభాగాలు వాస్తవ పరిమాణం కంటే పెద్దగా కనిపించేలా ఈ మ్యాప్‌‌‌‌ను అప్పట్లో రూపొందించారు. దీంతో యూరప్‌‌‌‌, ఉత్తర అమెరికా పెద్దగా.. ఆఫ్రికా, దక్షిణ అమెరికా చిన్నగా కనిపించాయి. 

ప్రస్తుతం వాటి అసలు సైజ్‌‌‌‌కు దగ్గరగా ఉండేలా కొత్త మ్యాప్‌‌‌‌ను తయారు చేయాలంటూ యూఎన్‌‌‌‌ తీర్మానం చేసింది. ఈ తీర్మానం అమలుతో ఆఫ్రికాతో పాటు లాటిన్‌‌‌‌ అమెరికా, దక్షిణాసియా, ఓషియానియా ప్రాంతాలు వాటి అసలు సైజ్‌‌‌‌కు దగ్గరగా, పాత మ్యాప్‌‌‌‌లో కంటే పెద్దగా కనిపిస్తాయి. విద్య, ప్రభుత్వ వ్యవస్థలు, మీడియా, వంటి రంగాల్లో మరింత కచ్చితమైన పటాలను ప్రోత్సహించడమే దీని ఉద్దేశమని యూఎన్‌‌‌‌ ప్రకటించింది.