- పెరిగిన నీటిమట్టం.. రైతులకు సాగునీటి భరోసా
లేహ్: సింధు జలాల ఒప్పందంపై నెలకొన్న పరిణామాల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లోని నీటి వనరులను సద్వినియోగం చేసుకునేందుకు భారత్ కీలక అడుగు వేసింది. లఢఖ్‌లోని ఉప్షీ వద్ద సింధు నదిపై కేంద్రపాలిత ప్రాంతంలోనే మొట్టమొదటి రాతి చెక్ డ్యామ్‌ను అధికారులు నిర్మించారు. సిమెంట్ వాడకుండా, సహజసిద్ధమైన భారీ బండరాళ్లతో నిర్మించిన ఈ ఆనకట్టతో లేహ్ ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి.
ఈ నిర్మాణంతో సింధు నదిలో నీటి మట్టం దాదాపు 10 అడుగుల మేర పెరిగింది. దీనివల్ల లోయల్లో దిగువన పారే నీటిని ఎగువనున్న ‘ఇగూ ఫే’ సాగునీటి కాలువ ద్వారా వ్యవసాయ భూములకు సులభంగా మళ్లించే అవకాశం ఏర్పడింది. ఈ చెక్ డ్యామ్‌కు దాదాపు 40 మిలియన్ లీటర్ల (4 కోట్ల లీటర్లు) నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. ఈ ప్రాంతంలో అత్యంత లోతులో సింధూ నది ప్రవహిస్తుండటంతో గతంలో నీటిని పైకి తోడటం రైతులకు కష్టంగా ఉండేది. ఈ నిర్మాణంతో ఉపశమనం లభించినట్లయింది. వసంత రుతువు విత్తనాల సీజన్‌లో నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ఎదురయ్యే నీటి కొరత సమస్య శాశ్వతంగా తీరనుంది.
