ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది.. కానీ అడగడానికి సంకోచం. ఓ సమస్యను చెప్పాలనిపిస్తుంది.. కానీ చుట్టూ ఉన్న వారి మాటలు గుర్తొచ్చి వెనక్కి తగ్గే పరిస్థితి. వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉన్నా.. ‘ఏమనుకుంటారో’ అన్న భయం. చివరకు మౌనమే మిగులుతుంది. ఈ మౌనం కొన్నిసార్లు ఆరోగ్య సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. సమయానికి పరీక్షలు చేయించుకోకుండా, సరైన వైద్య సలహా పొందకుండా, అపోహలనే నిజమని నమ్మి మనిషి లోలోపల కుమిలిపోయే దుర్బర పరిస్థితులకు దారితీస్తుంది. ఈ మానసిక క్షోభను తరిమికొట్టేలా లైంగిక ఆరోగ్యంపై అవగాహన కల్పిచేందుకు సెప్టెంబర్ 4న ‘ప్రపంచ లైంగిక ఆరోగ్య దినోత్సవం’గా నిర్వహిస్తోంది. లైంగిక ఆరోగ్యంపై సమాజంలో మరింత బహిరంగ చర్చ జరగాల్సిన అవసరాన్ని ఈ సందర్బంగా ‘ఎయిడ్స్ హెల్త్ కేర్ ఫౌండేషన్’(ఏహెచ్‌ఎఫ్) గుర్తుచేస్తోంది.
లైంగిక ఆరోగ్యం అనేది కేవలం వ్యాధుల నివారణకు సంబంధించిన అంశం కాదని.. అది వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, గౌరవం, జీవన నాణ్యతతో ముడిపడి ఉన్న ముఖ్యమైన భాగమని పేర్కొంది. ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు కేవలం ఒక రోజు మాత్రమే సరిపోదని గుర్తించి.. సెప్టెంబర్ 4 నుంచి నెల రోజుల పాటు ప్రపంచ లైంగిక అవగాహన మాసాన్ని ఏహెచ్ఎఫ్ నిర్వహిస్తోంది.
భారతదేశానికి లైంగికత, సాన్నిహిత్యం, సంబంధాలు, మానవ శ్రేయస్సుకు సంబంధించిన విస్తృతమైన సాంస్కృతిక చరిత్ర ఉంది. సాహిత్యం, కళలు, శిల్పాలు, సంప్రదాయాల్లో ఈ అంశాలకు ఎన్నో రూపాల్లో వ్యక్తీకరణ కనిపించింది. అయితే సమకాలీన సమాజంలో లైంగిక ఆరోగ్యం గురించి మాట్లాడటం ఇప్పటికీ చాలామందికి ఇబ్బందికరంగానే ఉంది. సిగ్గు, అపరాధ భావన, సామాజిక ముద్ర, తప్పుడు సమాచారం కారణంగా ఈ అంశంపై చర్చకు చాలామంది దూరంగా ఉంటున్నారు.
భాగస్వామితో, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా వైద్య నిపుణులతో కూడా ఆరోగ్య సమస్యలను పంచుకోవడానికి ఇప్పటికీ ఎంతోమంది వెనుకాడుతున్నారు. ఫలితంగా సందేహాలకు సమాధానాలు తెలుసుకోలేకపోవడం, సకాలంలో పరీక్షలు చేయించుకోకపోవడం, అవసరమైన వైద్య సహాయం పొందడంలో ఆలస్యం జరిగి ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే భద్రమైన, గోప్యమైన, గౌరవప్రదమైన, ఎలాంటి తీర్పు లేకుండా మాట్లాడుకునే వాతావరణం అవసరమని ‘ఏహెచ్‌ఎఫ్’ చెప్తోంది.
ఇంటి దగ్గరకే.. కండోమ్‌లు!
‘ఏహెచ్‌ఎఫ్, ఇండియా కేర్’ నిర్వహిస్తున్న ఫ్రీ కండోమ్ స్టోర్ దేశంలో తొలి ఆన్‌లైన్ ఉచిత కండోమ్ స్టోర్‌గా పేర్కొంది. ఎలాంటి తీర్పు, అపహాస్యం లేదా అనవసర అడ్డంకులు లేకుండా ప్రజలకు కండోమ్‌లు, ఇతర నివారణ వనరులను సులభంగా, గోప్యంగా అందుబాటులోకి తీసుకురావడం దీని ఉద్దేశం. అయితే.. కేవలం ఈ సంస్థ ఢిల్లీ, ముంబయిలోనే కాకుండా ఉచితంగా దేశంలోని ఏ మారుమూల ప్రాంతానికైనా ఉచితంగా కండోమ్‌లు కొరియర్ చేస్తోంది.
అంచున ఉన్న వర్గాలకు అండగా..
ట్రాన్స్‌జెండర్, జెండర్ డైవర్స్ వర్గాల కోసం ‘ఎఫ్‌ఎల్‌యూఎక్స్’ కార్యక్రమం ఆరోగ్య అవగాహన, కమ్యూనిటీ భాగస్వామ్యం, రిఫరల్స్, తగిన వైద్య సేవలకు అనుసంధానాన్ని బలోపేతం చేస్తోంది. ఆరోగ్య సేవలు పొందేవారిగా మాత్రమే కాకుండా, తమ జీవితాలను ప్రభావితం చేసే సమస్యలపై చర్చలు, పరిష్కారాల రూపకల్పనలో సమాజమే భాగస్వామిగా ఉండాలన్నది ఈ కార్యక్రమం విధానం. అలాగే ‘గే’ కమ్యూనిటీపై దృష్టి సారించిన ‘ఐఎంపీఎల్‌యూఎస్’ కార్యక్రమం హెచ్‌ఐవీ, ఎస్‌టీఐల నివారణ, పరీక్షలు, చికిత్స, వైద్య సేవలతో అనుసంధానంపై అవగాహన పెంచుతోంది.
మౌనం వీడటం అంటే.. ఒత్తిడి చేయడం కాదు
లైంగిక ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరూ ప్రశ్నలు అడగడం సురక్షితమని, వైద్య సహాయం కోరడం సాధారణ విషయమని, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎవరూ సిగ్గుపడాల్సిన అవసరం లేదని భావించే వాతావరణాన్ని సష్టించడమే లక్ష్యమని తెలిపింది. ఆరోగ్యకరమైన సమాజం అంటే ప్రజలకు విశ్వసనీయమైన సమాచారం అందుబాటులో ఉండటం.. తమను, తమ భాగస్వాములను రక్షించుకోవడం తెలిసి ఉండటం.. తమ హక్కులు, నిర్ణయాలపై అవగాహన కలిగి ఉండటం.. అవసరమైనప్పుడు సకాలంలో వైద్య సహాయం పొందగలగడం. ఈ ప్రపంచ లైంగిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మౌనాన్ని వీడి.. బహిరంగంగా, గౌరవంగా, ఎలాంటి తీర్పు లేకుండా మాట్లాడటం ప్రారంభిద్దాం.
- తిరుపతి వంగ, ఢిల్లీ ప్రతినిధి, వీ6 వెలుగు
వ్యాధి లేకపోవడమే ఆరోగ్యం కాదు..
లైంగిక ఆరోగ్యం అంటే లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు ( ఎస్‌టీఐఎస్) లేకపోవడం మాత్రమే కాదని ‘ఏహెచ్‌ఎఫ్’ సంస్థ విస్తృత ప్రచారం చేస్తోంది. తన శరీరం, లైంగిక జీవితానికి సంబంధించి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఆరోగ్యకరమైన, పరస్పర గౌరవంతో కూడిన సంబంధాలు, సమ్మతి, శారీరక స్వయం ప్రతిపత్తిపై అవగాహన, వివక్ష లేదా తీర్పు భయం లేకుండా సరైన సమాచారం, వైద్య సేవలు పొందే హక్కు కూడా ఇందులో భాగమే.
చికిత్సతోపాటు..నమ్మకం కూడా
ఢిల్లీ, ముంబైలోని ‘ఏఆర్‌టీ’ కేంద్రాల ద్వారా హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారికి యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ), కౌన్సెలింగ్, అవసరమైన ఆరోగ్య సేవలను పొందేందుకు సహకారం అందుతోంది. సకాలంలో నిర్ధారణ, చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగించడం, రెగ్యులర్ ఫాలోఅప్, ఆరోగ్య సేవలతో బలమైన అనుసంధానం ద్వారా మెరుగైన ఫలితాలు, జీవన నాణ్యత సాధించొచ్చని సంస్థ పేర్కొంది. వారానికి ఒకసారి నిర్వహించే హెల్త్ అండ్ వెల్‌నెస్ క్లినిక్స్ ద్వారా ఆరోగ్య సమాచారం, స్క్రీనింగ్, కౌన్సెలింగ్, వెల్‌నెస్ సాయం అందిస్తున్నారు.
లైంగిక ఆరోగ్య అవగాహన నెలగా..
ఎయిడ్స్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ (ఏహెచ్ఎఫ్) సెప్టెంబర్ నెలను లైంగిక ఆరోగ్య అవగాహన మాసంగా పాటిస్తోంది. కేవలం భారత్ లోనే కాకుండా 50కి పైగా దేశాలలో లైంగిక ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి కృషి చేస్తోంది. సామాజిక, ఆర్థిక లేదా ఇతర కారణాలతో ఆరోగ్య సేవలకు దూరంగా ఉండే వర్గాలకు హెచ్‌ఐవీ నివారణ, చికిత్స, లైంగిక ఆరోగ్యం, వెల్‌నెస్ సేవలను చేరువ చేయడంపై దష్టి సారిస్తోంది.
కచ్చితమైన సమాచారం, నివారణ సాధనాలు, పరీక్షలు, చికిత్స, కౌన్సెలింగ్, నిరంతర సంరక్షణకు అనుసంధానం వంటి సేవలను అందిస్తోంది. దేశంలో ఏహెచ్ఎఫ్ ఇండియా కేర్స్– 2004 నుంచి యువత, ఎల్జీబీటీక్యూ ప్లెస్ వర్గాలు, సెక్స్ వర్కర్లు, మాదకద్రవ్యాలు వాడేవారు, ఇతర అణగారిన వర్గాలతో కలిసి లైంగిక ఆరోగ్యం, హెచ్ఐవీ, ఎస్ఐటీ నివారణ, పరీక్షలు, చికిత్స, శ్రేయస్సు గురించి అవగాహనపై పనిచేస్తోంది. ఇటీవల ఏహెచ్ ఇండియా కేర్స్ సంస్థ ఢిల్లీ, ముంబైలలో ఫ్రైడే వెల్‌నెస్ క్లినిక్‌లను ప్రారంభించింది. ఇవి ఉచిత ఎస్ఐటీ స్క్రీనింగ్, సిండ్రోమిక్ చికిత్స, లైంగిక ఆరోగ్య కౌన్సెలింగ్, కండోమ్‌లను అందిస్తున్నాయి.
- ఇండియా కేర్స్ కంట్రీ ప్రోగ్రామ్ డైరెక్టర్ డా. వి. సామ్ ప్రసాద్, ఏహెచ్ఎఫ్ ఇండియా కేర్స్
