- 2028 జూన్ నాటికి ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేస్తామని వెల్లడి
- ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పనిచేస్తోంది: పీసీసీ చీఫ్
- అసెంబ్లీకి రానివారు.. కాంగ్రెస్‌ను విమర్శించడం హాస్యాస్పదం: చామల
- నల్గొండ జిల్లాలో రూ.344 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో పదేండ్లుగా పడకేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నకిరేకల్ నియోజకవర్గంలో రూ.344 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుకు వందల కోట్లు కేటాయించి పనులు వేగవంతం చేశామని, ఈ టర్మ్‌లోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
అయిటిపాముల లిఫ్ట్, ఏఎంఆర్ ఎస్ఎల్‌బీసీ హైలెవల్ కాలువ, డిండి ప్రాజెక్టు పనులతో పాటు ఉమ్మడి జిల్లాలోని ధర్మారెడ్డి, పిల్లలమర్రి, బునాదిగాని కాలువలను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. దశాబ్దాల కల అయిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ను జూన్ 2028 నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇస్తే.. తాము ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం అందించి సామాన్యుల ప్రభుత్వంగా నిలిచామని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక రేషన్ కార్డులను పంపిణీ చేసినట్లు వివరించారు.
గత సర్కార్ ఫ్యామిలీ కోసమే.. కాంగ్రెస్ ప్రజల కోసం: పీసీసీ చీఫ్
పదేండ్లుగా బీఆర్ఎస్ కేవలం ఒక కుటుంబం కోసమే పనిచేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. సర్దా ర్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని హైదరాబాద్‌లో ప్రతిష్ఠించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. గద్దర్ గౌరవార్థం 'గద్దర్ పురస్కారాలు', 'జయ జయహే తెలంగాణ'ను రాష్ట్ర గీతంగా ఎంపిక చేశామన్నారు. వెనుకబడిన తరగతుల ఆశ జ్యోతులైన ఎందరో మహానుభావుల విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవించామని గుర్తుచేశారు. రాబోయే రెండున్నరేళ్లలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి, వచ్చే ఎన్నికల్లో వందకు పైగా స్థానాల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ 'బిల్లా రంగాల' విమర్శలకు నకిరేకల్ సభే సమాధానం: ఎంపీ చామల
ప్రతిపక్ష హోదాలో ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాని కేసీఆర్.. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనను విమర్శించడం హాస్యాస్పదమని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణను అడ్డగోలుగా దోచుకుని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్ కుటుంబానిదేనని మండిపడ్డారు. కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో ప్రజల కష్టాలను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులుగా ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.
