వీరయ్యకు తండ్రి నుంచి వారసత్వంగా రెండెకరాల నేల, ఉండడానికి ఒక పూరిల్లు వచ్చింది. ఆ రెండు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ వీరయ్య జీవనం సాగించేవాడు. అతడికి మొక్కలంటే పిచ్చి. ఇంటిముందున్న ఖాళీస్థలంలో రకరకాల మొక్కలు పెంచుతూ ఆనందించేవాడు.
ఒకసారి తన పొలంగట్ల మీద కొత్తరకం ఆకులు గల మొక్కలను కొన్నింటిని చూశాడు. ఆశ్చర్యం వేసింది. ఎక్కడినుంచో వచ్చిన పక్షులరెట్ట వల్ల ఆ విత్తనాలు పడి ఆ మొక్కలు మొలకెత్తి ఉండవచ్చనుకున్నాడు. వాటిని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇంటిముందు ఖాళీస్థలంలోనాటాడు.
‘‘ఎందుకండి? పిచ్చిమొక్కలు ఎక్కడ కనపడ్డా తీసుకొచ్చి ఇంట్లో నాటుతారు?” అని విసుక్కుంది అతని భార్య. నవ్వి ఊరుకున్నాడు వీరయ్య. త్వరలోనే ఆ మొక్కలు పెద్దవయ్యాయి. వీరయ్యకు ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమార్తె పెళ్లీడుకు వచ్చింది. సంబంధం కుదిరింది. పది సవర్ల బంగారం అమ్మాయికి పెట్టమన్నారు పెళ్లికొడుకు తరపువారు.
వీరయ్యకు ఏమి చేయాలో తోచలేదు. ఏ ఏడుకాఏడు వచ్చే వ్యవసాయ ఫలితం తిండికి, గుడ్డకి సరిపోతున్నది. దాచిపెట్టింది ఏదీలేదు. ఇది ఇలా ఉండగా ఒకరోజు కాశీకి వెళ్తున్న సాధువుల బృందం ఒకటి విశ్రాంతికని ఊరి బయట సత్రంలో దిగింది. సాధువులంటే వీరయ్యకు అమితభక్తి. సత్రానికి వెళ్లి వారిని సాదరంగా తీసుకొచ్చి అతిథి మర్యాదలు చేశాడు.
భోజనాలు పెట్టాడు వారు తిరిగి వెళ్లే సమయంలో ఇంటిముందు వీరయ్య పెంచిన మొక్కలను గమనించి ఆశ్చర్యపోయారు. హిమాలయాల్లో మారుమూల అడవుల్లో కనిపించే ఈ మొక్కలు ఇక్కడకు ఎలా వచ్చాయో అర్థం కాలేదు. ఆశ్చర్యంలో మునిగి ఉన్నసాధువుల నుంచి వీరయ్య మొక్కల వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ‘‘అవి బంగారుమొక్కలు. వాటి ఆకుల చివరలను పిండి వచ్చే రసాన్ని ప్రత్యేక పద్ధతిలో కాస్తే అందులో నుంచి బంగారం వస్తుంది.
భూమి నుంచి బంగారు ఖనిజ రేణువులను నీటితోపాటు గ్రహించి ఆ మొక్కల వేళ్లు కాండానికి అందిస్తాయి. ఆ నీరు ఆకుల చివరి భాగానికి చేరుతాయి. అందువల్ల ఆకుల చివర బంగారు రేణువులు ఉంటాయి. ఇదీ ఈ మొక్కల ప్రత్యేకత’’ అని వారు వీరయ్యతో చెప్పి ఆకుల నుంచి బంగారం తీసిచ్చి అతిథి మర్యాదలకు కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయారు. వీరయ్య చింత తీరింది. అమ్మాయి పెళ్లి జరిగిపోయింది.
‘‘ఏమే వాటిల్ని పిచ్చిమొక్కలన్నావు గదా! చూశావా అందులో బంగారం ఉన్నది. ఏ మొక్కా పిచ్చి మొక్క కాదు. అన్ని మొక్కలూ ఉపయోగకరమైనవే. అదృష్టవశాత్తూ మనకు నేరుగా బంగారాన్నిచ్చాయి. కానీ మానవుడికి లభించే సంపదలో అధికభాగం మొక్కలనుంచి వచ్చేదే. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సత్యం” అన్నాడు వీరయ్య.
ఆ తర్వాత ఇంకా ప్రత్యేక శ్రద్ధతో ఆ మొక్కలను వీరయ్య పెంచి వాటి ఆకుల రసం నుంచి బంగారాన్ని ప్రత్యేక పద్దతిలో తయారుచేయసాగాడు. కాలక్రమేణా వీరయ్య ధనవంతుడయ్యాడు. ఈ విషయం ఆనోటా ఈనోటా రాజుగారికి చేరింది. వీరయ్యను రాజు పిలిపించి ‘‘ఇలాంటి విద్య అందరికీ ఉపయోగపడాలి. అందుకని నువ్వు రాజాస్థానంలో ఉండాలి.
నిన్ను ఈ రాజ్యానికి వన సంరక్షణాధికారిగా నియమిస్తున్నాను. ఏ మొక్కా పిచ్చిమొక్కకాదు అని రుజువు చేశావు. నీ జీవితం అందరికీ ఆదర్శం. నీవల్ల లభించే బంగారాన్ని ఖజానాలో ఉంచి ప్రజల బాగుకొరకు వాడతాను’’ అన్నాడు. సంతోషంగా ఒప్పుకున్నాడు వీరయ్య.
- డా. గంగిశెట్టి శివకుమార్-
