ఒక చిన్నారి అనారోగ్యంతో మొదలైన ఆవేదన.. వేలాది కుటుంబాలకు అండగా నిలిచే సేవగా మారింది. తలసేమియా బాధితులకు ఉచిత చికిత్స, రక్త మార్పిడితో పాటు వ్యాధి నివారణపై అవగాహన కల్పిస్తూ తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ (టీఎస్‌సీఎస్), హైదరాబాద్ ముందుకు సాగుతోంది. 4,700 మందికి పైగా నమోదైన రోగులకు సేవలందిస్తున్న సంస్థ ఇప్పటివరకు దాదాపు 3 లక్షల ఉచిత రక్త మార్పిడులు చేసింది.
1998లో తల్లిదండ్రులు, వైద్యులు, శ్రేయోభిలాషులతో మొదలైన టీఎస్‌సీఎస్.. ప్రత్యేక రక్తనిధి, రక్త మార్పిడి కేంద్రం, ఆధునిక పరీక్షా కేంద్రం, పరిశోధనా విభాగంతో సమగ్ర సేవా కేంద్రంగా ఎదిగింది. వైద్యం, పరీక్షలు, మందులు, సలహాలతో పాటు రోగులకు భోజనం కూడా ఉచితంగా అందిస్తోంది. రోజూ 70–80 మంది సేవలు పొందుతుండగా, దూర ప్రాంతాల కుటుంబాల కోసం ఖమ్మం, కర్నూలులో శాఖలను ఏర్పాటు చేశారు.
ప్రపంచ సదస్సుకు వేదిక
జనవరిలో ‘తలసేమియా రహిత భారత్–2035’ లక్ష్యంతో ఆసియా తలసేమియా సదస్సు–2026 నిర్వహించిన టీఎస్‌సీఎస్.. అక్టోబర్ 23–25 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో జరగనున్న ప్రపంచ సదస్సుకు స్థానిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. వైద్యులు, పరిశోధకులు, ప్రయోగశాల నిపుణులు, విధాన నిర్ణేతలు, రోగుల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సులో పరిశోధనలు నేరుగా రోగులకు చేరే మార్గాలపై చర్చించనున్నారు. మార్హమ్‌తో కలిసి వైద్యులకు తాజా నిర్ధారణ, చికిత్స విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్, నారాయణ హృదయాలయ, బెంగళూరులోని సంకల్ప్ ఇండియా ఫౌండేషన్‌తో కలిసి ఉచిత ఎచ్‌ఎల్‌ఏ పరీక్షలు, ఎముక మజ్జ మార్పిడి చికిత్సకు సలహాలు, ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
నివారణే లక్ష్యం
పెళ్లికి ముందు లేదా గర్భధారణ తొలిదశలో ఎచ్‌బీఏ2 పరీక్ష ద్వారా తలసేమియా వాహకులను గుర్తించవచ్చు. అయితే చాలామంది కుటుంబాలు బిడ్డ పుట్టిన తర్వాతే సమస్యను గుర్తిస్తున్నారని డాక్టర్ చంద్రకాంత్ అగర్వాల్ చెప్తున్నారు. ఆయన మనవరాలు నిత్యా చిన్నతనంలో తలసేమియాతో బాధపడిన అనుభవం ఆయనను ఈ సేవలో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యేలా చేసింది.
‘రెడ్ ద సిటీ’ వంటి రక్తదాన కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. టీఎస్‌సీఎస్ 25వ వార్షికోత్సవం, అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ చంద్రకాంత్ అగర్వాల్‌కు లభించిన గుర్తింపుల కంటే.. రోగులు, కుటుంబాలు, వైద్యులు, సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తల సేవలే తనకు ముఖ్యమని ఆయన చెప్తున్నారు. మరిన్ని ప్రాంతాలకు సేవలు విస్తరించడం, గర్భిణుల పరీక్షలను సాధారణం చేయడం, పరిశోధన భాగస్వామ్యాలను పెంచడం తదుపరి లక్ష్యాలు.
