పదేండ్ల మోసాలు మరిచి ప్రజా ప్రభుత్వంపై నిందలా?..BRS హయాంలో జరిగిన అన్యాయాలను సరిచేస్తున్నాం

పదేండ్ల మోసాలు మరిచి ప్రజా ప్రభుత్వంపై నిందలా?..BRS హయాంలో జరిగిన అన్యాయాలను సరిచేస్తున్నాం
  • ఏఐసీసీ జాతీయ మహిళా కార్యదర్శి బెస్త ఆదిత ఫైర్

కాగజ్ నగర్, వెలుగు:  బీఆర్ఎస్ సర్కార్ పదేళ్ల పాలనలో జరిగిన అన్యాయాలు, మోసాలను మరిచిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ఏఐసీసీ జాతీయ మహిళా కార్యదర్శి బెస్త ఆదిత మండిపడ్డారు. 

ఆసిఫాబాద్​జిల్లా కౌటాలలో జరిగిన సభలో సీఎం, మంత్రులపై మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎమ్మెల్యే కోనప్ప చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. శనివారం కాగజ్ నగర్ లోని తన నివాసంలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ప్రాణహిత ప్రాజెక్ట్ తరలింపులో అప్పటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీశ్ రావు, నాటి స్థానిక ఎమ్మెల్యే కోనప్ప రైతులకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి.. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.

 22ఏ భూముల నిషేధిత జాబితా విషయంలో బీఆర్ఎస్ హయంలోనే తప్పిదాలు జరిగాయని అన్నారు. అధికారుల తప్పిదం వల్ల దొర్లిన పొరపాట్లను సరిచేస్తామని మంత్రి స్వయంగా చెప్పినా బీఆర్ఎస్ నాయకులు అనవసర రాద్దాంతం చేయడం రాజకీయ లబ్ధి కోసమేనని మండిపడ్డారు. ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.